దేశీ బ్యాంకింగ్‌పై ‘క్రెడిట్‌ సూసీ’ ప్రభావం ఉండదు..

21 Mar, 2023 06:29 IST|Sakshi

ఆ బ్యాంకుకు భారత్‌లో కార్యకలాపాలు తక్కువే

జెఫ్రీస్‌ ఇండియా నివేదిక

న్యూఢిల్లీ: భారత బ్యాంకింగ్‌ వ్యవస్థపై స్విస్‌ బ్యాంకు క్రెడిట్‌ సూసీ సంక్షోభ ప్రభావాలేమీ ఉండకపోవచ్చని ఆర్థిక సేవల దిగ్గజం జెఫ్రీస్‌ ఇండియా అభిప్రాయపడింది. మూతబడ్డ అమెరికన్‌ బ్యాంకు ఎస్‌వీబీ (సిలికాన్‌ వ్యాలీ బ్యాంకు)తో పోలిస్తే క్రెడిట్‌ సూసీకి భారత్‌తో కొంత ఎక్కువ అనుబంధమే ఉన్నప్పటికీ .. దానికి ఇక్కడ కార్యకలాపాలు మాత్రం స్పల్పంగా ఉండటమే ఇందుకు కారణమని ఒక నివేదికలో పేర్కొంది. దీని ప్రకారం క్రెడిట్‌ సూసీకి భారత్‌లో ఒకే ఒక్క శాఖ, రూ. 20,000 కోట్ల కన్నా తక్కువ అసెట్స్‌ ఉన్నాయి. అంతర్జాతీయంగా కొన్ని బ్యాంకులు మూతబడటం, పలు బ్యాంకులు ఒత్తిడిలో ఉండటం వంటి అంశాల నేపథ్యంలో ఎప్పటికప్పుడు చోటు చేసుకుంటున్న కొత్త పరిణామాలను రిజర్వ్‌ బ్యాంక్‌ నిశితంగా పరిశీలిస్తోందని నివేదిక తెలిపింది. లిక్విడిటీపరమైన సమస్యలేమైనా వస్తే పరిస్థితిని చక్కదిద్దేందుకు అవసరమైతే ఆర్‌బీఐ సత్వరం జోక్యం చేసుకునే అవకాశం ఉందని పేర్కొంది.

భారత్‌ విషయంలో స్థూల ఆర్థిక పరిస్థితులు సానుకూలంగా ఉన్నందున ప్రస్తుతం అంతర్జాతీయంగా ఆర్థిక సంక్షోభాలేమైనా వచ్చినా తట్టుకుని నిలబడగలదని కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ఎండీ ఉదయ్‌ కొటక్‌ ఇప్పటికే ధీమా వ్యక్తం చేశారు. క్రెడిట్‌ సూసీ ఇటీవలి కాలంలో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సౌదీ ఇన్వెస్టరు మరిన్ని పెట్టుబడులు పెట్టబోమంటూ ప్రకటించడంతో రెండు రోజుల క్రితం క్రెడిట్‌ సూసీ బ్యాంకు షేరు భారీగా పతనమైంది. అయితే, స్విస్‌ నేషనల్‌ బ్యాంక్‌ (ఎస్‌ఎన్‌బీ) 54 బిలియన్‌ డాలర్ల రుణాన్ని అందించడానికి ముందుకు రావడంతో మరుసటి రోజు మళ్లీ కోలుకుంది. భారత్‌లో విదేశీ బ్యాంకులకు కార్యకలాపాలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. దేశీయంగా అసెట్స్‌లో వాటి వాటా 6 శాతంగా ఉంది. అయితే, డెరివేటివ్‌ మార్కెట్లలో (ఫారెక్స్, వడ్డీ రేట్లు) మాత్రం అవి చురుగ్గా ఉంటున్నాయి. ఆయా మార్కెట్లలో విదేశీ బ్యాంకులకు 50 శాతం దాకా వాటా ఉంటోంది. 

మరిన్ని వార్తలు