జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాలో ‘ఎయిర్‌పోర్ట్స్‌’ విలీనం

21 Mar, 2023 06:32 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో (జీఐఎల్‌)లో జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ లిమిటెడ్‌ సంస్థ (జీఏఎల్‌) విలీనం కానుంది. నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి ఈ విలీన ప్రక్రియ వచ్చే ఆర్థిక సంవత్సరంలో పూర్తి కానుందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. భవిష్యత్‌ వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునేలా పటిష్టంగా ఎదిగేందుకు ఇది దోహదపడగలదని జీఐఎల్‌ వివరించింది.

ఎయిరోపోర్ట్స్‌ డి పారిస్‌ (గ్రూప్‌ ఏడీపీ)తో జీఎంఆర్‌ భాగస్వా మ్యాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లేందుకు సహాయపడగలదని పేర్కొంది. జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ ఇన్‌ఫ్రా 2020లో గ్రూప్‌ ఏడీపీతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. తాజా విలీనానంతరం జీఐఎల్‌లో జీఎంఆర్‌ గ్రూప్‌నకు అత్యధికంగా 33.7 శాతం, గ్రూప్‌ ఏడీపీకి 32.3 శాతం, పబ్లిక్‌ వాటాదారుల దగ్గర 34 శాతం వాటాలు ఉంటాయి. 10 ఏళ్ల విదేశీ కరెన్సీ కన్వర్టబుల్‌ బాండ్ల జారీ ద్వారా గ్రూప్‌ ఏడీపీ నుంచి 331 మిలియన్‌ యూరోలు (సుమారు రూ. 2,900 కోట్లు) సమీకరించనున్నట్లు జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా తెలిపింది.  

మరిన్ని వార్తలు