Wi-Fi HaLow: కిలో మీటర్‌ దూరంలో ఉన్నా వైఫైని వినియోగించుకోవచ్చు..!

15 Nov, 2021 15:19 IST|Sakshi

టెక్నాలజీ అప్‌డేట్‌ అయ్యే కొద్ది మానవుని జీవన విధానం మరింత సులభతరం అయ్యింది. ఇప్పటికే డేటా సైన్స్‌, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌' వంటి టెక్నాలజీలు వర్క్‌ కల్చర్‌ను పూర్తిగా మార్చేయగా..ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ) అదే దారిలో పయనిస్తుంది. తాజాగా ఐఓటీ టెక్నాలజీతో మీరు కిలోమీటర్‌ దూరంలో ఉన్నా సరే డివైజ్‌లను  వినియోగించుకునేందుకు ఈ 'వైఫై హాలో'(wifi halow) ఉపయోగపడనుంది.  

'వైఫై హాలో' అంటే?
'వైఫై హాలో' అంటే సింపుల్‌ గా చెప్పాలంటే ఇంట్లో ఉండే ఐఓటీ ప్రొడక్ట్‌లు స్మార్ట్‌ స్పీకర్స్‌, స్మార్ట్‌ ఎయిర్‌ కండీషనర్స్‌ తో పాటు స్మార్ట్‌ హోం సెక్యూరిటీ సిస్టం, వేరబుల్‌ హెల్త్‌ మానిటర్స్‌, బయో మెట్రిక్‌ సైబర్‌ సెక్యూరిటీ స్కానర్స్‌'ను  కిలోమీటర్‌ దూరంలో ఉన్నా వైఫై ద్వారా ఈజీగా కనెక్ట్‌ అయ్యేందుకు ఉపయోగపడుతుందని ప్రపంచ వ్యాప్తంగా వైఫై నెట్‌ వర్క్‌లను అందించే 'వైఫై అలయన్స్‌' సంస్థ తెలిపింది. పరిమిత సంఖ్యలో వైఫై కొత్త టెక్నాలజీ అందుబాటులో ఉన్న స్మార్ట్‌ డివైజెస్‌లో పనిచేస్తుందని  చెప్పింది. వైఫై టెక్నాలజీ కోసం కొత్త ఎక్విప్‌మెంట్‌ అవసరం లేదని,ప్రస్తుతం మన రోజూ వారి జీవితంలో భాగమైన వైఫై సెటప్‌తోనే ఈ వైఫై హాలో పనిచేస్తుందని వెల్లడించింది. 

ఏ అప్లికేషన్‌లలో వైఫై హాలోని వినియోగించుకోవచ్చు?
వైఫై హాలో'ని ఇళ్లు, సంస్థల్లో ఉండే స్మార్ట్‌ పరికరాలను కనెక్ట్‌ చేయడంతో పాటు వివిధ రకాలైన అప్లికేషన్‌లలో ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు ట్రాఫిక్ సిగ్నల్స్, ట్రాఫిక్ మానిటర్లు, వ్యవసాయ క్షేత్రాల్లో (స్మార్ట్‌ అగ్రికల్చర్‌)సెన్సార్లను కనెక్ట్ చేయడానికి కూడా దీనిని ఉపయోగించవచ్చు. తద్వారా టెక్నాలజీ పరంగా మరింత అప్‌ డేట్‌ కావొచ్చని నిపుణులు చెబుతుండగా.. తక్కువ సమయంలో పెద్దమొత్తంలో ఉన్న డేటాను ట్రాన్స్‌ఫర్‌ చేసేందుకు ఉపయోగడపడే వైఫై నెట్‌ వర్క్‌కు ప్రత్యామ్నాయం కాదని అంటున్నారు.  

 

'వైఫై హాలో'ఎలా పని చేస్తుంది?
వైఫై హాలో టెక్నాలజీ ఇళ్లులో, లేదంటే రైల్వే స్టేషన్‌లలో వినియోగించే వైఫై కంటే ఫాస్ట్‌గా పనిచేస్తుంది. సాధారణ వైఫై నెట్‌వర్క్‌లు వినియోగించడం వల్ల ఖర్చయ్యే కరెంట్‌ కంటే..తక్కువ స్థాయిలో కరెంట్‌ వినియోగంతో దూరంలో ఉన్నా సరే ఎక్కువ మంది ఉపయోగించుకునేందుకు సాయపడుతుంది. బ్యాండ్‌ విడ్త్ పరంగా వైఫై హాలో సాధారణ వైఫై బ్యాండ్‌ విడ్త్‌ 2.4జీహెచ్‌జెడ్‌ నుండి 5జీహెచ్‌జెడ్‌'ల కంటే తక్కువ స్థాయిలో అంటే కేవలం 1జిహెచ్‌జెడ్‌ తో పనిచేసేలా డెవలప్‌ చేస్తున్నట్లు వైఫై అలయన్స్‌ ఇటీవల విడుదల చేసిన రిపోర్ట్‌లో పేర్కొంది. 

చదవండి: నాసా మరో సంచలనం..! చంద్రుడిపై వైఫై నెట్‌ వర్క్‌ నేరుగా భూమిపైకే...!

మరిన్ని వార్తలు