Twitter Remote Work Ban: ట్విటర్‌ ఉద్యోగి కీలక చర్య: ఎలాన్‌ మస్క్‌కు మరో షాక్‌!

18 Nov, 2022 16:57 IST|Sakshi

న్యూఢిల్లీ: ట్విటర్‌ కొత్త బాస్‌, బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ మరో షాక్‌ తగిలింది. తనను అన్యాయంగా విధుల్లోంచి తొలగించారని ఆరోపిస్తూ  ట్విటర్‌కు చెందిన  దివ్యాంగ ఉద్యోగి ఒకరు కోర్టును ఆశ్రయించారు.  దీంతో  ఈ వ్యవహారంలో కోర్టులో మూడు కేసులు నమోదైనాయి. 

కాలిఫోర్నియాకు చెందిన ఇంజినీరింగ్ మేనేజర్ డిమిత్రి బోరోడెంకో బుధవారం శాన్ ఫ్రాన్సిస్కో ఫెడరల్ కోర్టులో  దావా వేశారు. వర్క్‌ ఫ్రం హోం విధానంలో పనిచేస్తున్న తనను ఆఫీసుకు తిరిగి రావాలని ఆదేశించారని  అయితే  దీనికి నిరాకరించడంతో ట్విటర్ తనను తొలగించిందని పేర్కొన్నారు. ఇది ఫెడరల్ అమెరికన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ ఉల్లంఘన అని బోరోడెంకో చెప్పారు. తన వైకల్యం కారణంగా కోవిడ్‌ బారిన పడితే కష్టమని ఆయన వాదించారు. అలాగే డిమాండ్ పనితీరు,ఉత్పాదకత ప్రమాణాలను అందుకోలేక పోవడంతో వైకల్యం ఉన్నఅనేక మంది ట్విటర్ ఉద్యోగులు బలవంతంగా రాజీనామా చేయవలసి వచ్చిందని మరో దావాలో పేర్కొన్నారు. ఈక్వల్ ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీ కమిషన్, 2020లో విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం యజమానికి భారం కానంతవరకు వర్క్‌ ఫ్రం హోం పని విధానం సహేతుకమైందే.  

అలాగే రిమోట్‌  పనివిధానాన్ని రద్దు  చేసిన మస్క్‌ నేతృత్వంలోని ట్విటర్‌ యాజమాన్యం చట్టం ప్రకారం 60 రోజుల నోటీసు ఇవ్వకుండా వేలాదిమంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించిందని ఆరోపిస్తూ అదే కోర్టులో మరో ఫిర్యాదు దాఖలైంది.  ట్విటర్‌ను స్వాధీనం చేసుకున్న మస్క్‌ ఇంత తక్కువ సమయంలో ఉద్యోగులను చాలా ఆవేదనకు, బాధకు గురిచేశాడని వారిని అనిశ్చితిలో పడవేశాడని ట్విటర్‌కు వ్యతిరేకంగా దాఖలైన ఈ మూడు కేసులను వాదిస్తున్న   న్యాయవాది షానన్ లిస్-రియోర్డాన్ వ్యాఖ్యానించారు. తాజా పరిణామాలపై ట్విటర్‌ అధికారికంగా స్పందించలేదు.  ట్విటర్‌ మస్క్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత దాదాపు 3,700 మంది ఉద్యోగులను లేదా కంపెనీలోని సగం మంది ఉద్యోగులను ఆకస్మికంగా తొలగించడం ద్వారా చట్టాన్ని ఉల్లంఘించిందని శాన్ ఫ్రాన్సిస్కో ఫెడరల్ కోర్టు  ఇప్పటికే  పేర్కొన్న సంగతి తెలిసిందే. (మునుగుతున్న ట్విటర్‌ 2.0? ఉద్యోగుల సంఖ్య తెలిస్తే షాకవుతారు!)

కాగా ఎక్కువ పనిగంటలు పనిచేస్తూ, ట్విటర్‌ అభివృద్ధికి తోడ్పడతారో, లేదా సంస్థను వీడతారో తేల్చుకోమని ట్విటర్‌ ఉద్యోగులకు అల్టిమేటం జారీ చేయడం కలకలం రేపింది. దీంతో వందలాది ఉద్యోగులు కంపెనీకి గుడ్‌బై చెప్పడం మరింత ఆందోళన రేగింది. ఫలితంగా నవంబరు 21, సోమవారం వరకు ట్విటర్‌ ఆఫీసులను మూసివేస్తున్నట్టు ట్విటర్‌ అధికారికంగా  ప్రకటించింది.  అంతేకాదు  పనితీరు, ప్రతిభ ఆధారంగా వారికి ప్రాధాన్యత ఉంటుందని తెగేసి చెప్పింది. అలాగే రిమోట్‌గా పనిచేసే ఉద్యోగుల పనితీరును ఎక్కువ చేసి చూపిస్తూ ఆయా మేనేజర్లు తప్పుడు రిపోర్ట్‌ చేస్తే వారిపై చర్యలు తప్పవని గట్టిగా హెచ్చరించడం గమనార్హం. (ఉద్యోగుల ఝలక్‌, ఆఫీసుల మూత: మస్క్‌ షాకింగ్‌ రియాక్షన్‌)

మరిన్ని వార్తలు