Dmart : డీమార్ట్‌ లాభాలు.. హై జంప్‌

12 Jul, 2021 11:07 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) తొలి త్రైమాసికంలో డీమార్ట్‌ స్టోర్ల నిర్వాహక సంస్థ ఎవెన్యూ సూపర్‌మార్ట్స్‌ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్‌–జూన్‌)లో నికర లాభం రెట్టింపునకుపైగా ఎగసి రూ. 95 కోట్లను అధిగమించింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 40 కోట్లు మాత్రమే ఆర్జించింది. 

గతేడాది క్యూ1లో దేశవ్యాప్త లాక్‌డౌన్‌ కారణంగా అమ్మకాలు ప్రభావితమైన విషయాన్ని ఈ సందర్భంగా కంపెనీ ప్రస్తావించింది. కాగా.. మొత్తం ఆదాయం సైతం రూ. 3,883 కోట్ల నుంచి రూ. 5,183 కోట్లకు జంప్‌చేసింది. మొత్తం వ్యయాలు రూ. 3,875 కోట్ల నుంచి రూ. 5,077 కోట్లకు పెరిగాయి. ఈ క్యూ1 ప్రారంభంలోనూ స్థానికంగా కఠిన లాక్‌డౌన్‌లు అమలైనప్పటికీ మూడు, నాలుగు వారాల తదుపరి ఆంక్షలు తొలగుతూ వచ్చినట్లు కంపెనీ తెలియజేసింది.
 

మరిన్ని వార్తలు