భారత్‌కు ట్రంప్ జూనియర్..రియల్‌ ఎస్టేట్‌ రంగంపై కన్ను, వేలకోట్ల పెట్టుబడులు?

6 Dec, 2022 21:58 IST|Sakshi

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తనయుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో తన వ్యాపార కార్యాలపాల్ని విస్తరించేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఈ డిసెంబర్ నెలలో భారత్‌లో పర్యటించనున్నారు. 

ట్రంప్‌ జూనియర్‌కు చెందిన ది ట్రంప్‌ ఆర్గనైజేషన్‌ ముంబై ట్రిబెకా డెవలపర్స్‌ భాగస్వామ్యంతో భారత్‌లో పలు నిర్మాణాలు చేపట్టనుంది. ఇప్పటికే ‘ట్రంప్‌’ బ్రాండ్‌ పేరుతో దేశీయంగా లగ్జరీ ప్రాజెక్ట్‌లను నిర్మిస్తుంది.  ఇందుకోసం ట్రిబెకా డెవలపర్స్‌, లోధా గ్రూప్‌తో జతకట్టింది. 

ఇక, ట్రంప్‌ ఆర్గనైజేషన్‌ భారత్‌లో ఇప్పటివరకు ట్రంప్‌ టవర్‌ ఢిల్లీ - ఎన్‌సీఆర్‌, ట్రంప్‌ టవర్స్‌ కోల్‌కతా, ట్రంప్‌ టవర్‌ పూణే, ట్రంప్‌ టవర్‌ ముంబై నాలుగు లగ్జరీ ప్రాజెక్ట్‌ల నిర్మాణాలను చేపట్టింది. 

డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్‌ రాకపై ట్రిబెకా డెవలపర్స్‌ ప్రతినిధులు స్పందించారు. తమ సంస్థ 10వ వార్షికోత్సవం సందర్భంగా జూనియర్‌ భారత్‌కు వస్తున్నట్లు తెలిపారు. భారత పర్యటన నేపథ్యంలో ట్రిబెకా డెవలపర్స్‌ అధినేత కల్పేష్‌ మెహత,  ట్రంప్‌ జూనియర్‌లు వ్యాపారాన్ని విస్తరించే ప్రణాళికలపై ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. 

భారత్‌లో ట్రంప్‌ లగ్జరీ ప్రాజెక్ట్‌లు 
2014లో ది ట్రంప్‌ ఆర్గనైజేషన్‌ భారత్‌లో తన వ్యాపార కార్యకలాపాల్ని ప్రారంభించింది. తొలిసారిగా ముంబైలో లోథా గ్రూప్‌తో ఇంటి నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టింది. పూణేలో పంచశీల్‌ రియాల్టీ సంస్థ భాగస్వామ్యంలో లగ్జరీ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసింది. కోల్‌ కతాలో ట్రంప్‌ టవర్స్‌ 140 అల్ట్రా లగ్జరీ అపార్ట్‌మెంట్స్‌ను ప్రారంభించింది. 2018లో గురుగ్రామ్‌, హర్యానాలలో మరో లగ్జరీ ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టింది.  
 

మరిన్ని వార్తలు