ECI: కొత్త ఓటర్లకు భారత ఎన్నికల సంఘం శుభవార్త..!

25 Jan, 2022 14:56 IST|Sakshi

Election Commission of India: 2021లో ఓటర్ల జాబితాలో కొత్తగా పేరు నమోదు చేసుకున్న ఓటర్లకు భారత ఎన్నికల సంఘం శుభవార్త తెలిపింది. ఈ ఏడాది కొత్తగా జాబితాలో తమ పేరు నమోదు చేసుకున్న ఓటర్లకు ఎలక్టర్ ఫోటో ఐడెంటిటీ కార్డు(EPIC)లను పోస్ట్ ద్వారా పంపాలని నిర్ణయించినట్లు భారత ఎన్నికల సంఘం సీనియర్ అధికారి ఒకరు నేడు తెలిపారు. జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకునే జనవరి 25న ఈ కొత్త సేవలను ప్రారంభించనున్నట్లు అధికారి తెలిపారు.

"మేము ఓటరు కార్డులను నేరుగా గ్రహీతలకు పోస్ట్ ద్వారా పంపిణీ చేయడం ప్రారంభిస్తాము. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఈ సేవలను అధికారికంగా ప్రారంభిస్తున్నట్లు' అని ఆయన తెలిపారు. ఈ కొత్త ఓటర్లకు EPIC గుర్తింపు కార్డులతో పాటు ఒక ప్యాకెట్ కూడా పంపుతున్నట్లు అధికారి తెలిపారు. ఈ ప్యాకెట్‌లో ఈవీఎం, ఓటింగ్ విధానంతో సహా మొత్తం సమాచారం ఉంటుందని ఆయన తెలిపారు. అలాగే, భారత ఎన్నికల సంఘానికి చెందిన పోర్టల్ ద్వారా కూడా కార్డు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

భారత ఎన్నికల సంఘాన్ని 25 జనవరి 1950న స్థాపించడం జరిగింది. భారతదేశంలో ప్రతి సంవత్సరం ఎన్నికల సంఘం స్థాపన రోజున జాతీయ ఓటరు దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజున ఓటర్లకు ఓటుపై అవగాహన కల్పించేందుకు 18 ఏళ్లు నిండిన యువకులకు గుర్తింపు కార్డులను అందజేసి ప్రతి సంవత్సరం ఓటర్లను ఓటు వేయమని ఎన్నికల సంఘం ప్రోత్సహిస్తుంది. ప్రతి సంవత్సరం ఓటరు దినోత్సవం సందర్భంగా ఒక థీమ్‌ ఎంచుకుంటారు. ఈ ఏడాది ఓటర్ల దినోత్సవం ఇతివృత్తం 'సాధికారత, జాగరూకత, రక్షణ'. 

(చదవండి: మీరు ధరలు పెంచుతూ పోతే.. మేం చూస్తూ ఊరుకుంటామా ?)

>
మరిన్ని వార్తలు