2021–22లో 10 శాతం వృద్ధి: నీతి ఆయోగ్‌

3 Nov, 2021 04:13 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22)లో 10 శాతం ఉంటుందని విశ్వసిస్తున్నట్లు నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఏడు సంవత్సరాల మోదీ ప్రభుత్వం దేశంలో పటిష్ట ఆర్థిక వృద్ధికి పునాదులు వేసిందన్నారు. కోవిడ్‌–19 వల్ల ఎదురయిన సవాళ్లను దేశం సమర్థవంతంగా ఎదుర్కొంటోందని వివరించారు.

వచ్చే ఐదేళ్లూ భారత్‌ ప్రపంచంలోనే వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందన్న అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) నివేదికను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రపంచ పెట్టుబడిదారులను భారత్‌ ఆర్థిక వ్యవస్థ ఆకర్షించగలుగుతోందన్నారు. అయితే దేశంలో ఉపాధి కల్పన అనుకున్నంత వేగంగా లేదని ఆయన అంగీకరించారు. మోదీ ప్రభుత్వం ఏడేళ్లలో 485 ప్రభుత్వ పథకాలను ప్రత్యక్ష ప్రయోజన బదలాయింపు (డీబీటీ) పరిధిలోకి తీసుకుని వచ్చిందన్నారు. డీబీటీ ద్వారా రూ.5.72 లక్షల కోట్లు బదిలీ అయినట్లు కూడా కుమార్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు