ఎలాన్‌ మస్క్‌పై కోర్టులో దావా: ఇష్టమొచ్చినట్లు తొలగించడం కాదు.. కట్టు రూ. 4వేల కోట్లు!

13 Jul, 2023 15:54 IST|Sakshi

ఎలాన్‌ మస్క్‌ ఆధీనంలోని ట్విటర్‌కు దావాలు, కోర్టు పిటిషన్‌ల సెగ తగులుతూనే ఉంది. ట్విటర్‌ను కొనుగోలు చేసి ఉద్యోగులను భారీ సంఖ్యలో తొలగించినప్పటి నుంచి అనేక దావాలు ఆ సంస్థపై దాఖలవుతున్నాయి. తొలగించిన ఉద్యోగులకు చెల్లించాల్సిన 500 మిలియన్‌ డాలర్లు ( సుమారు రూ. 4,104 ​కోట్లు) పరిహారం చెల్లింపులో ట్విటర్‌ విఫలమైందంటూ తాజాగా అమెరికా కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. 

ట్విటర్‌ హెచ్‌ఆర్‌ విభాగంలో పని చేసిన కోర్ట్నీ మెక్‌మిలాన్‌ ఈ ఏడాది జనవరిలో శాన్‌ఫ్రాన్సిస్కో ఫెడరల్‌ కోర్టులో దావా వేశారు. ఎలాన్‌ మస్క్‌ ఆధీనంలోని ట్విటర్‌ 2022 అక్టోబర్‌ నుంచి అప్పటి సీఈవో పరాగ్‌ అగర్వాల్‌ సహా 80 శాతం మందిని తొలగించిందని, మొత్తంగా 6వేల మందికి పైగానే ఉద్యోగులకు ఉద్వాసన పలికిందని మెక్‌మిలాన్‌ తన దావాలో పేర్కొన్నారు.

ట్విటర్‌ సీవెరెన్స్‌ ప్లాన్‌ ప్రకారం.. తొలగించే ఉద్యోగికి కనీసం రెండు నెలల జీతం, హెల్త్‌ ఇన్సూరెన్స్‌, ఇతర బెనిఫిట్లకు సంబంధించిన నగదు పరిహారం చెల్లించాల్సి ఉందన్నారు. అలాగే సీనియర్‌ ఉద్యోగులకు ఆరు నెలల బేస్‌ శాలరీతోపాటు ఏడాదికి ఒక వారం చొప్పున మూల వేతనం బాకీ ఉందన్నారు. దీని గురించి ఉద్యోగుల తొలగింపునకు ముందే ఎలాన్‌ మస్క్‌కు తెలుసునని పిటషనర్‌ ఆరోపించారు. 

మరోవైపు తొలగించిన ఉద్యోగులకు పరిహారంగా మూడు నెలల వేతనం చెల్లిస్తామని ట్విటర్‌ అప్పట్లో హామీ ఇచ్చింది. ఇందులో యూఎస్‌ చట్టాల ప్రకారం చెల్లించాల్సిన రెండు నెలల వేతనంతోపాటు  సీవెరన్స్‌ ప్లాన్‌ కింద అదనంగా మరో నెల వేతనం ఉంటుంది. ఉద్యోగులకు ఎటువంటి సమాచారం లేకుండా సీవెరన్స్‌ ప్లాన్‌ను ట్విటర్‌ ​మార్చిందని, న్యాయబద్ధంగా తమకు రావాల్సిన ప్రయోజనాలను ట్విటర్‌ యాజమాన్యం చెల్లించడంలో విఫలమైందంటూ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.

ఇదీ చదవండి: ట్విటర్‌ యూజర్లకు షాకిచ్చిన మస్క్‌.. ఇక రోజుకు అన్నే ట్వీట్లు..

మరిన్ని వార్తలు