ఎలాన్‌ మస్క్‌కు మరో ఎదురుదెబ్బ: సోర్స్‌ కోడ్‌ లీక్‌ కలకలం

27 Mar, 2023 11:09 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలోని ట్విటర్‌కు మరో షాక్‌ తగిలినట్టు తెలుస్తోంది. ట్విటర్‌ సోర్స్‌ కోడ్‌ ఆన్‌లైన్‌లో లీక్ అయిందన్న తాజా అంచనాలు కలకలం రేపాయి. 44 బిలియన్‌డాలర్లతో సంస్థను కొనుగోలు చేసినప్పటినుంచి అనేక సవాళ్లను మధ్య  నెట్టుకొస్తున్న మస్క్‌కు  ఇది మరో సవాల్‌ అని నిపుణులు భావిస్తున్నారు. 

న్యూయార్క్ టైమ్స్ ప్రకారం, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కోసం ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ GitHub నుండి లీక్ అయిన సమాచారాన్ని తీసివేసేలా ట్విటర్‌ చట్టపరమైన చర్య తీసుకున్న తర్వాత ఈ కోడ్ లీక్‌ విషయం వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా కోడ్‌లో భద్రతా లోపాలు హ్యాకర్‌లకు వినియోగదారు డేటాను దొంగిలించడానికి లేదా సైట్‌ను తీసివేయడానికి అవకాశం ఇస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ లీకైన్‌ సోర్స్‌ కోడ్‌లో ట్విటర్‌,  ఇంటర్నల్‌  టూల్స్‌ ప్రాపర్టీ   సోర్స్ కోడ్  ఉంది, అయితే ఇది ట్వీట్‌లను సిఫార్సు చేసే సోర్స్ కోడ్ లీక్‌లో భాగమేనా అనే దానిపై మరింత స్పష్టత రావాల్సి  ఉంది. (మస్క్‌ కీలక నిర్ణయం: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌!)

దీనికి సంబంధించి కాలిఫోర్నియాలోని నార్తర్న్ కోర్ట్‌లో  దాఖలైన ఫిర్యాదు మేరకు అనుమతి లేకుండా దాని సోర్స్ కోడ్ స్నిప్పెట్‌లను షేర్ చేసిన తర్వాత  GitHubకి  నోటీసు లిచ్చింది. కాపీరైట్ ఉల్లంఘన నోటీసు తర్వాత కంటెంట్‌ను తక్షణమే తీసివేయడానికి GitHub అంగీకరించింది, అయితే కోడ్ ఆన్‌లైన్‌లో ఎంతకాలం ఉందో అస్పష్టంగా ఉంది.   డేటాను షేర్ చేసిన  యూజర్‌ పేరు   “FreeSpeechEnthusiast” గా తెలుస్తోంది.  కానీ ఈ వ్యవహారంపై ట్విటర్ ఇంకా స్పందించలేదు.

గత ఏడాది మస్క్ ట్విటర్ టేకోవర్ చేసిన సంగతి తెలిసిందే. గతంలో ట్వీట్‌లను సిఫార్సుకుఉపయోగించే కోడ్ మార్చి 31న ఓపెన్ సోర్స్ చేయనున్నట్టు వెల్లడించారు. మరోవైపు ట్విటర్‌ విలువ దాదాపు  సగానికి పడిపోయిందని అంగీకరించిన మస్క్, యూజర్లకు బ్లూ సబ్‌స్క్రిప్షన్,  ప్రకటనదారులకు మరిన్ని ప్రయోజనాలను అందించడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

>
మరిన్ని వార్తలు