షుగర్ మిల్ ఓనర్లతో ముఖేష్ అంబానీ చర్చలు - ఎందుకో తెలుసా?

7 Dec, 2023 17:26 IST|Sakshi

భారతదేశంలో అత్యంత సంపన్నుడు, ప్రముఖ వ్యాపారవేత్త 'ముఖేష్ అంబానీ' (Mukesh Ambani) తన కొత్త వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేయడానికి కొన్ని సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంత? ఆ వ్యాపారం ఏంటనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ.. కంప్రెస్డ్ బయోగ్యాస్ (CBG) ఉత్పత్తికి కీలకమైన ముడిసరుకు చెరుకు వ్యర్దాలు సేకరించడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగానే చక్కెర మిల్లు నిర్వాహకులతో చర్చలు కూడా జరుపుతున్నట్లు సమాచారం.

అనుకున్నవన్నీ సజావుగా జరిగితే.. రిలయన్స్ బయోగ్యాస్ ఉత్పత్తి ప్లాంట్స్ మరిన్ని త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. బయోగ్యాస్ ఉత్పత్తి కోసం కంపెనీ టన్నుల కొద్దీ చెరకు వ్యర్థాలు కొనుగోలు చేయనుంది. రానున్న ఐదేళ్లలో 100 బయోగ్యాస్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు.. ఒక్కో ప్లాంట్ 5.5 మిలియన్ టన్నుల వ్యవసాయ వ్యర్థాలు, సేంద్రియ వ్యర్థాలను ప్రాసెస్ చేసి బయోగ్యాస్‌ను ఉత్పత్తి చేయనున్నట్లు సమాచారం.

రిలయన్స్ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్‌ను నిర్వహిస్తోంది, ఈ మధ్య కాలంలో ప్రారంభమైన ఈ ప్లాంట్ నిర్వహణకు టన్నుల కొద్దీ చెరుకు వ్యర్దాలు అవసరమని స్పష్టమైంది. బయోగ్యాస్ ప్లాంట్లలో ఉపయోగించే వ్యర్దాల వల్ల సంవత్సరానికి 2 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించవచ్చని, 2.5 టన్నుల సేంద్రియ ఎరువును తయారు చేయవచ్చని చెబుతున్నారు.

ఇదీ చదవండి: రతన్ టాటా పేరిట మోసం.. వైరల్ అవుతున్న పోస్ట్

గత నెలలో కోల్‌కతాలో జరిగిన బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ 7వ ఎడిషన్‌లో ముఖేష్ అంబానీ మాట్లాడుతూ.. స్వదేశంలో అభివృద్ధి చెందిన సాంకేతికల ఆధారంగా అతి పెద్ద బయో ఎనర్జీ ఉత్పత్తిదారుగా భారత్ అవతరిస్తుందని వెల్లడించారు. బయోగ్యాస్ ఉత్పత్తికి రిలయన్స్ కంపెనీ మాత్రమే కాకుండా అదానీ కంపెనీ కూడా ప్రయత్నాలు చేస్తోంది.

>
మరిన్ని వార్తలు