5జీ యూజర్లు @ 33 కోట్లు!

17 Jun, 2021 00:11 IST|Sakshi

నెలవారీ డేటా వినియోగం

ప్రతి స్మార్ట్‌ఫోన్‌కు 40 జీబీ

దేశీయంగా 2026 నాటికి అంచనా

ఎరిక్సన్‌ నివేదిక

న్యూఢిల్లీ: దేశీయంగా 5జీ టెలికం సేవలకు సంబంధించి యూజర్ల సంఖ్య 2026 నాటికి 33 కోట్లకు చేరే అవకాశం ఉంది. అలాగే ప్రతీ స్మార్ట్‌ఫోన్‌పై నెలవారీగా డేటా వినియోగం మూడు రెట్లు ఎగిసి 40 గిగాబైట్‌లకు (జీబీ) చేరనుంది. టెలికం పరికరాల తయారీ దిగ్గజం ఎరిక్సన్‌ బుధవారం ఒక నివేదికలో ఈ విషయాలు వెల్లడించింది. ప్రస్తుతం నెలవారీ ప్రతీ స్మార్ట్‌ఫోన్‌పై సగటు వినియోగం 14.6 జీబీగా ఉంటోంది. తద్వారా అత్యధిక డేటా వినియోగంలో భారత్‌ రెండో స్థానంలో కొనసాగుతోంది. ‘‘భారత్‌ ప్రాంతంలో 4జీ సబ్‌స్క్రిప్షన్లు 2020లో 68 కోట్లుగా ఉండగా 2026 నాటికి 83 కోట్లకు చేరతాయని అంచనా. 2026 ఆఖరు నాటికి భారత్‌లో మొత్తం మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌లలో 5జీ కనెక్షన్లు 26 శాతంగా దాకా .. అంటే సుమారు 33 కోట్ల స్థాయిలో ఉండవచ్చు’’ అని ఎరిక్సన్‌ నివేదికలో పేర్కొంది.

5జీపై మెట్రోల్లో ఆసక్తి.. 
మెగా, మెట్రో నగరాల్లో ప్రస్తుతం ఇంటి ఇంటర్నెట్‌ కనెక్షన్‌ కోసం కేవలం 4జీపైనే ఆధారపడుతున్న వారిలో దాదాపు 42 శాతం మంది .. 5జీ ఫిక్స్‌డ్‌ వైర్‌లెస్‌ యాక్సెస్‌ కనెక్షన్లపై ఆసక్తిగా ఉన్నట్లు ఎరిక్సన్‌ ఇండియా హెడ్‌ నితిన్‌ బన్సల్‌ తెలిపారు. ‘‘5జీ కనెక్టివిటీకి కేవలం 10 శాతం అధికం చెల్లించాల్సి రావచ్చు. అయితే, బండిల్డ్‌ డిజిటల్‌ సర్వీసులు కూడా లభిస్తే 5జీ కోసం 50 శాతం ఎక్కువైనా చెల్లించేందుకు భారత్‌లో 50 శాతం మంది వినియోగదారులు సిద్ధంగా ఉన్నారు. 5జీ అందుబాటులోకి వచ్చిన తొలి ఏడాదిలో 4 కోట్ల మంది యూజర్లు కనెక్షన్‌ తీసుకునే అవకాశం ఉంది’’ అని ఆయన పేర్కొన్నారు.

నివేదికలోని మరిన్ని విశేషాలు.. 

  • 2020లో స్మార్ట్‌ఫోన్‌ సబ్‌స్క్రిప్షన్‌లు 81 కోట్లుగా ఉండగా, ఏటా 7 శాతం వృద్ధి రేటుతో 2026 నాటికి 120 కోట్లకు చేరనున్నాయి.
  • 2020లో మొత్తం మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్లలో స్మార్ట్‌ఫోన్ల వాటా 72 శాతంగా ఉంది. స్మార్ట్‌ఫోన్ల వాడకం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో 2026 నాటికి ఇది 98 శాతానికి చేరనుంది.
  • భారత్‌లో స్మార్ట్‌ఫోన్ల వాడకం అధికంగా ఉండటంతో పాటు వర్క్‌ ఫ్రం హోమ్‌ అవసరాల కోసం కూడా స్మార్ట్‌ఫోన్లను వినియోగిస్తుండటంతో డేటా వినియోగం భారీగా ఉంది.
  • గతంలో నెలకు 6.9 ఎక్సాబైట్లుగా (ఈబీ) ఉన్న  మొ బైల్‌ డేటా వినియోగం, 2020 నాటికి 9.5 ఈబీకి పెరిగింది. 2026కి 4 రెట్లు పెరిగి 41 ఈబీకి చేరనుంది.
  • కొత్తగా 43 కోట్ల పైచిలుకు స్మార్ట్‌ఫోన్లు సబ్‌స్క్రిప్షన్లు జత కానుండటంతో 2016 నాటికి వీటి సంఖ్య 120 కోట్లకు చేరనుంది.
మరిన్ని వార్తలు