ఆన్‌లైన్‌ దిగ్గజాల కట్టడిపై ఈయూ దృష్టి - మరింత ఎక్కువ కానున్న నిఘా!

7 Sep, 2023 06:52 IST|Sakshi

డిజిటల్‌ మార్కెట్స్‌ గేట్‌కీపర్స్‌ పరిధిలోకి 6 సంస్థలు

లండన్‌: ఆన్‌లైన్‌ కంపెనీల గుత్తాధిపత్యాన్ని కట్టడి చేయడంపై యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా కొత్త డిజిటల్‌ చట్టాల కింద ఆరు కంపెనీలను ఆన్‌లైన్‌ ‘గేట్‌కీపర్స్‌‘ పరిధిలోకి చేర్చింది. వీటిలో యాపిల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్‌ మాతృ సంస్థ ఆల్ఫాబెట్, ఫేస్‌బుక్‌ మాతృ సంస్థ మెటా, టిక్‌టాక్‌ మాతృ సంస్థ బైట్‌డ్యాన్స్‌ ఉన్నాయి. గేట్‌కీపర్లుగా ఈ సంస్థలపై నిఘా మరింత ఎక్కువగా ఉంటుంది. ఆయా కంపెనీలు డిజిటల్‌ మార్కెట్స్‌ చట్టాలను పాటించడం మొదలుపెట్టేందుకు ఆరు నెలల గడువు ఉంటుంది. 

చట్టం ప్రకారం తమతో పాటు ఇతర కంపెనీలు కూడా తమ తమ ఉత్పత్తులు, సర్వీసుల పనితీరులో గణనీయంగా మార్పులు, చేర్పులు చేయాల్సి రానున్నట్లు గూగుల్‌ తెలిపింది. కొత్త చట్టం ప్రకారం.. మెసేజింగ్‌ సేవల సంస్థలు ఒకదానితో మరొకటి కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు టెలిగ్రామ్‌ లేదా సిగ్నల్‌ యూజర్లు తమ టెక్ట్స్‌ లేదా వీడియో ఫైల్స్‌ను వాట్సాప్‌ యూజర్లకు కూడా పంపించుకోవచ్చు. 

ఇక ప్లాట్‌ఫామ్‌లు సెర్చి రిజల్ట్‌లో తమ ఉత్పత్తులకు .. పోటీ సంస్థల ఉత్పత్తులు, సర్వీసులకు మించిన రేటింగ్‌ ఇచ్చుకోకూడదు. కాబట్టి అమెజాన్‌ లాంటివి థర్డ్‌ పార్టీ వ్యాపారుల ఉత్పత్తుల కన్నా తమ ఉత్పత్తులే సులభంగా కనిపించేలా చేయడానికి ఉండదు. అటు ఆన్‌లైన్‌ సేవల సంస్థలు .. నిర్దిష్ట యూజర్లు లక్ష్యంగా పంపే ప్రకటనల కోసం వివిధ వేదికల్లోని యూజర్ల వ్యక్తిగత డేటాను కలగలిపి వాడుకోవడానికి కుదరదు. ఉదాహరణకు ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్, వాట్సాప్‌ సర్వీసులను వినియోగించుకునే యూజర్ల డేటాను వారి సమ్మతి లేకుండా ఆయా వేదికల మాతృసంస్థ మెటా కలగలిపి వినియోగించుకోవడానికి కుదరదు. 

మరిన్ని వార్తలు