హెలో.. యూపీఐ - ఇక వాయిస్‌ ఆధారిత చెల్లింపులు

7 Sep, 2023 07:00 IST|Sakshi

ముంబై: యూపీఐ వేదికగా వాయిస్‌ ఆధారిత పేమెంట్స్‌ సహా పలు కొత్త రకాల చెల్లింపు విధానాలను నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) ఆవిష్కరించింది. గ్లోబల్‌ ఫిన్‌టెక్‌ ఫెస్టివల్‌ సందర్భంగా వీటిని ప్రకటించింది. 

ఇందులో హెలో!యూపీఐ అనే విధానంతో యాప్స్, టెలికం కాల్స్, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ పరికరాల ద్వారా వాయిస్‌ ఆధారిత యూపీఐ చెల్లింపులు చేయొచ్చు. ఇది హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో అందుబాటులో ఉంటుంది. త్వరలోనే ఇతర ప్రాంతీయ భాషల్లోనూ దీన్ని అందుబాటులోకి తేనున్నట్లు ఎన్‌పీసీఐ తెలిపింది.

బ్యాంకులు మంజూరు చేసిన క్రెడిట్‌ లైన్‌ను యూపీఐ ద్వారా కూడా వినియోగించుకోవచ్చని పేర్కొంది. ఇక ఆఫ్‌లైన్‌లోనూ నగదును పంపించేందుకు, అందుకునేందుకు లైట్‌ ఎక్స్‌ సాధనం ఉపయోగపడగలదని ఎన్‌పీసీఐ తెలిపింది. అలాగే, యూపీఐ ట్యాప్‌ అండ్‌ పే విధానంతో ఎన్‌ఎఫ్‌సీ (నియర్‌ ఫీల్డ్‌ కమ్యూనికేషన్‌) ఆధారిత క్యూఆర్‌ కోడ్స్‌పై ట్యాప్‌ చేసి, చెల్లింపుల ప్రక్రియ పూర్తి చేయొచ్చని వివరించింది.

మరిన్ని వార్తలు