వారానికి జరిగే సైబర్‌ అటాక్‌లు ఎన్నంటే..

23 Oct, 2023 18:13 IST|Sakshi

డేటా భద్రతపై నిపుణులు ఆందోళన 

భారతదేశంలో డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధి వేగంగా పురోగమిస్తుంది. అయితే అందుకు అనువుగా డేటా భద్రత, సైబర్‌ సెక్యూరిటీ వంటి అంశాల నిర్వహణ సవాలుగా మారుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. పొరుగు దేశాల్లోని శత్రువులు, స్కామర్లు పెరుగుతున్న నేపథ్యంలో వీటి నిర్వహణ మరింత క్లిష్టంగా మారుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దేశవ్యాప్తంగా జరిగిన కొన్ని సర్వేలు, ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం..ఇండియాలోని సంస్థలపై సగటున గత ఆరు నెలల్లో వారానికి 2,157 సార్లు సైబర్‌ దాడులు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఒక్కో సంస్థపై సగటున 1,139 దాడులు జరిగాయి.

ఇటీవల జరిగిన సింగపూర్ సైబర్ వీక్-2023 సమావేశంలో నిపుణులు మాట్లాడారు. భారతీయ సాంకేతిక నిపుణులు, వ్యాపార కార్యనిర్వాహకులు పరస్పరం సహకారం అందించుకుంటూ డేటా భద్రతపరంగా సమగ్ర వ్యవస్థను రూపొందించాలన్నారు. దేశ పురోగతికి ప్రధాన అంశాలైన ఐటీ పరిశ్రమలతోపాటు ఆరోగ్య సంరక్షణ, విద్య/ పరిశోధన, రిటైల్, హాస్పిటాలిటీ, మాన్యుఫ్యాక్చరింగ్, రవాణా వంటి రంగాలు సైబర్ సెక్యూరిటీ సవాళ్లకు అనువుగా చర్యలు తీసుకోవాలని నిపుణులు తెలిపారు.

రోజురోజూ సైబర్ సెక్యూరిటీ చాలా క్లిష్టంగా మారుతుందని ఏపీఏసీ చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ వివేక్ గుల్లపల్లి చెప్పారు. కంపెనీల్లోని ఐటీ విభాగం తరచు సైబర్‌ సెక్యూరిటీని నిర్వహించాలని ఆయన సూచించారు. సంస్థలో సైబర్ సెక్యూరిటీ వ్యూహాన్ని అమలు చేయడానికి బోర్డులు, మేనేజ్‌మెంట్‌ సభ్యులతో కలిసి పని చేయాలన్నారు.

మరిన్ని వార్తలు