బంగారం- వెండి.. కోలుకున్నాయ్‌

18 Sep, 2020 10:31 IST|Sakshi

ప్రస్తుతం 10 గ్రాముల పసిడి రూ. 51,512కు

ఎంసీఎక్స్‌లో కేజీ వెండి రూ. 68,310 వద్ద ట్రేడింగ్‌

న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌ పసిడి 1946 డాలర్లకు

26.97 డాలర్ల వద్ద కదులుతున్న ఔన్స్‌ వెండి

ఇటీవల ఆటుపోట్ల మధ్య కదులుతున్న పసిడి, వెండి ధరలు ప్రస్తుతం దేశ, విదేశీ మార్కెట్లలో  కోలుకున్నాయి. అయితే.. ఇటీవల వెలువడిన గణాంకాలు ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన అమెరికా, చైనా రికవరీ బాట పట్టినట్లు సంకేతాలివ్వడంతో బంగారం, వెండి ధరలు కొద్ది రోజులుగా నేలచూపులకు లోనవుతూ వచ్చాయి. దీనికితోడు ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు పుంజుకోవడం కూడా పసిడి ధరలను దెబ్బతీస్తున్నట్లు బులియన్‌ విశ్లేషకులు పేర్కొన్నారు. తాజా పాలసీ సమీక్షలో ఫెడరల్‌ రిజర్వ్‌ 2 శాతం ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని సాధించేటంతవరకూ నామమాత్ర వడ్డీ రేట్లనే కొనసాగించనున్నట్లు తెలియజేసింది. నిరుద్యోగిత తగ్గడం, హౌసింగ్‌కు డిమాండ్‌ వంటివి బలపడుతుండటం రికవరీకి సంకేతాలని ఫెడరల్‌ రిజర్వ్‌ పేర్కొంది. అయితే  ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌-19 విస్తరిస్తూనే ఉన్న కారణంగా తిరిగి బంగారం ధరలు బలపడే అవకాశమున్నదని నిపుణులు అంచనా వేస్తున్నారు.  

లాభాలతో..
ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల పసిడి రూ. 59 పుంజుకుని రూ. 51,512 వద్ద ట్రేడవుతోంది. ఇది అక్టోబర్‌ ఫ్యూచర్స్‌ ధర కాగా.. వెండి కేజీ డిసెంబర్‌ ఫ్యూచర్స్‌ రూ. 168 లాభపడి రూ. 68,310 వద్ద కదులుతోంది.

వెనకడుగు..
ఎంసీఎక్స్‌లో గురువారం బంగారం, వెండి ధరలు డీలా పడ్డాయి. 10 గ్రాముల పుత్తడి రూ. 371 క్షీణించి రూ. 51,453 వద్ద ముగిసింది. తొలుత 51,710 వద్ద బలహీనంగా ప్రారంభమైంది. తదుపరి 51,181 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక వెండి కేజీ రూ. 639 నష్టంతో రూ. 68,142 వద్ద స్థిరపడింది. రూ. 68,280 వద్ద ప్రారంభమైన వెండికి ఇదే ఇంట్రాడే గరిష్టంకాగా.. ఒక దశలో రూ. 67,150 వరకూ వెనకడుగు వేసింది.  

కామెక్స్‌లో.. ప్లస్
న్యూయార్క్‌ కామెక్స్‌లో ప్రస్తుతం బంగారం, వెండి  ధరలు బలపడ్డాయి. ఔన్స్‌(31.1 గ్రాములు) పసిడి 0.5 శాతం పుంజుకుని 1,960 డాలర్లకు చేరింది. స్పాట్‌ మార్కెట్లోనూ 0.4 శాతం లాభపడి 1952 డాలర్ల వద్ద కదులుతోంది.  వెండి మరింత అధికంగా ఔన్స్ 0.76 శాతం ఎగసి 27.31 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. 

మరిన్ని వార్తలు