పసిడి, వెండి.. బౌన్స్ బ్యాక్

10 Nov, 2020 10:40 IST|Sakshi

రూ. 50,386 వద్ద ట్రేడవుతున్న 10 గ్రాముల బంగారం 

ఎంసీఎక్స్‌లో రూ. 62,292 వద్ద కదులుతున్న వెండి

న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌ పసిడి 1,881 డాలర్లకు

24.32 డాలర్ల వద్ద కదులుతున్న ఔన్స్‌ వెండి

సోమవారం పసిడి రూ. 2,500- వెండి రూ. 4,100 డౌన్

విదేశీ మార్కెట్లోనూ 5 శాతం కుప్పకూలిన బంగారం

న్యూయార్క్/ ముంబై : ప్రపంచ దేశాలను వణికిస్తున్న మహమ్మారి కోవిడ్-19 కట్టడికి రూపొందించిన వ్యాక్సిన్ 90 శాతం విజయవంతమైనట్లు అమెరికన్ ఫార్మా దిగ్గజం ఫైజర్ ప్రకటించడంతో సోమవారం పసిడి ధరలు 5 శాతంపైగా కుప్పకూలాయి. న్యూయార్క్ కామెక్స్ లో ఔన్స్ 1860 డాలర్ల దిగువకు చేరాయి. దీంతో దేశీయంగానూ ఎంసీఎక్స్‌లో ధరలు భారీగా పతనమయ్యాయి. పసిడి రూ. 2,500, వెండి 4,000కుపైగా పడిపోయాయి. అయితే ప్రస్తుతం తిరిగి జోరందుకున్నాయి. ట్రేడర్లు స్క్వేరప్ లావాదేవీలు చేపట్టడం ప్రభావాన్ని చూపుతున్నట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి.

ఏం జరిగిందంటే?
జర్మన్ కంపెనీ బయోఎన్ టెక్ భాగస్వామ్యంలో రూపొందించిన వ్యాక్సిన్ క్లినికల్ పరీక్షలలో 90 శాతంపైగా ఫలితాలు సాధించినట్లు ఫైజర్ తాజాగా పేర్కొంది. ఈ నెలఖారుకల్లా ఎమర్జెన్సీ ప్రాతిపదికన వినియోగించేందుకు అమెరికన్ ఔషధ నియంత్రణ సంస్థ నుంచి అనుమతి లభించగలదన్న ఆశాభావాన్ని సైతం వ్యక్తం చేసింది. దీంతో సంక్షోభ పరిస్థితుల కారణంగా ఇటీవల ర్యాలీ చేస్తున్న పసిడి, వెండి ధరలు పతనమయ్యాయి. దీనికితోడు ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు 0.65 శాతం పుంజుకోవడం, 10 ఏళ్ల ట్రెజరీ ఈల్డ్స్ 1 శాతం జంప్ చేయడం ప్రభావం చూపినట్లు విశ్లేషకులు తెలియజేశారు. కాగా.. ప్రస్తుతం దేశ, విదేశీ మార్కెట్లో బంగారం, వెండి ధరలు కోలుకున్నాయి. వివరాలు చూద్దాం..

లాభాలతో..
ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 638 పెరిగి రూ. 50,386 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్‌ ఫ్యూచర్స్‌ ధర కాగా.. ఇంట్రాడేలో రూ. 50,446 వద్ద గరిష్టాన్ని తాకింది. రూ. 49,931 వద్ద ప్రారంభమైంది. ఇది ఇంట్రాడే కనిష్టంకావడం గమనార్హం. ఇక వెండి కేజీ డిసెంబర్‌ ఫ్యూచర్స్‌ రూ. 1,438 లాభపడి రూ. 62,292 వద్ద కదులుతోంది. తొలుత రూ. 61,900 వరకూ క్షీణించిన వెండి ధర తదుపరి జోరందుకుంది. రూ. 62,365 వరకూ జంప్ చేసింది. 

హుషారుగా..
సోమవారం కుప్పకూలిన బంగారం, వెండి ధరలు న్యూయార్క్‌ కామెక్స్‌లో తాజాగా బలపడ్డాయి. ఔన్స్‌(31.1 గ్రాములు) పసిడి 1.5 శాతం ఎగసి 1,881 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్‌ మార్కెట్లోనూ 1.1 శాతం లాభంతో 1,884 డాలర్లకు చేరింది. వెండి సైతం 2.6 శాతం జంప్ చేసి ఔన్స్ 24.32 డాలర్ల వద్ద కదులుతోంది. 

పడిపోయాయ్‌
ఎంసీఎక్స్‌లో సోమవారం 10 గ్రాముల బంగారం రూ. 2,502 పతనమై రూ. 49,665 వద్ద ముగిసింది. ఇది డిసెంబర్‌ ఫ్యూచర్స్‌ ధర కాగా.. ఇంట్రాడేలో 52,520 వద్ద గరిష్టాన్ని తాకింది. ఇదేవిధంగా 49,500 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక వెండి కేజీ డిసెంబర్‌ ఫ్యూచర్స్‌ రూ. 4,160 పడిపోయి రూ. 60,725 వద్ద స్థిరపడింది. తొలుత ఒక దశలో 66,478 వరకూ జంప్ చేసిన వెండి తదుపరి రూ.  60,560 వరకూ కుప్పకూలింది. (చదవండి: రెండో రోజూ సరికొత్త రికార్డ్స్ )

మరిన్ని వార్తలు