మెరిసిన పసిడి, వెండి ధరలు

7 Nov, 2020 10:03 IST|Sakshi

రూ. 52,168 వద్ద ముగిసిన 10 గ్రాముల బంగారం

ఎంసీఎక్స్‌లో రూ. 65,355 వద్ద నిలిచిన కేజీ వెండి

ఇంట్రాడేలో 66,244ను తాకిన వెండి కేజీ

న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌ పసిడి 1,952 డాలర్లకు

25.66 డాలర్ల వద్ద స్థిరపడిన ఔన్స్‌ వెండి

న్యూయార్క్/ ముంబై : అమెరికా అధ్యక్ష పదవి రేసులో డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ విజయంవైపు సాగుతున్న నేపథ్యంలో వారాంతాన బంగారం, వెండి ధరలు హైజంప్ చేశాయి. వెరసి న్యూయార్క్ కామెక్స్ లో పసిడి ఔన్స్ 1950 డాలర్లను అధిగమించింది. ప్రభుత్వం నుంచి నిధుల విడుదల(స్టిములస్)కు బైడెన్ విజయం దోహదం చేయవచ్చన్న అంచనాలు పసిడి ధరలకు ప్రోత్సాహాన్నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. మరోవైపు కోవిడ్-19తో మందగించిన ఆర్థిక వ్యవస్థకు దన్నుగా సహాయక ప్యాకేజీలను అమలు చేయాలంటూ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ సైతం తాజాగా అభిప్రాయపడటం జత కలసినట్లు తెలియజేశారు. బైడెన్ గెలుపొందితే కనీసం ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీకి ప్రభుత్వం ఆమోదముద్ర వేయవచ్చన్న అంచనాలు పెరిగినట్లు తెలియజేశారు. వివరాలు చూద్దాం..

లాభాలతోనే..
ఎంసీఎక్స్‌లో శుక్రవారం 10 గ్రాముల బంగారం రూ. 113 పుంజుకుని రూ. 52,168 వద్ద ముగిసింది. ఇది డిసెంబర్‌ ఫ్యూచర్స్‌ ధర కాగా.. ఇంట్రాడేలో 52,450 వద్ద గరిష్టాన్ని తాకింది. ఇదేవిధంగా 51,711 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక వెండి కేజీ డిసెంబర్‌ ఫ్యూచర్స్‌ రూ. 1,102 లాభపడి రూ. 65,355 వద్ద స్థిరపడింది. తొలుత ఒక దశలో 66,244 వరకూ జంప్ చేసిన వెండి తదుపరి రూ. 64,024 వరకూ క్షీణించింది. 

కామెక్స్‌లో..
న్యూయార్క్‌ కామెక్స్‌లో ఆటుపోట్ల మధ్య శుక్రవారం బంగారం ధరలు లాభపడ్డాయి. ఔన్స్‌(31.1 గ్రాములు) పసిడి 0.25 శాతం పుంజుకుని 1,952 డాలర్ల వద్ద ముగిసింది. స్పాట్‌ మార్కెట్లో నామమాత్ర లాభంతో 1,951 డాలర్లకు చేరింది. వెండి సైతం దాదాపు 2 శాతం ఎగసి ఔన్స్ 25.66 డాలర్ల వద్ద స్థిరపడింది. 

మరిన్ని వార్తలు