హావెల్స్‌ లాభం జూమ్‌

21 Jul, 2023 06:39 IST|Sakshi

క్యూ1లో రూ. 287 కోట్లు

న్యూఢిల్లీ: ఎలక్ట్రికల్‌ గూడ్స్, అప్లయెన్సెస్‌ దిగ్గజం హావెల్స్‌ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఏప్రిల్‌–జూన్‌(క్యూ1)లో నికర లాభం 18 శాతం వృద్ధితో రూ. 287 కోట్లను తాకింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 243 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 4,292 కోట్ల నుంచి రూ. 4,899 కోట్లకు బలపడింది.

కన్జూమర్‌ డిమాండ్‌ బలహీనపడటంతోపాటు.. వాతావరణం సహకరించకపోవడంతో బీటూసీ బిజినెస్‌ సైతం ప్రభావితమైనట్లు కంపెనీ చైర్మన్, ఎండీ అనిల్‌ రాయ్‌ గుప్తా పేర్కొన్నారు. అయితే బీటూబీ, లాయిడ్‌ విభాగాలు మెరుగైన పనితీరు చూపినట్లు వెల్లడించారు.  తాజా సమీక్షా కాలంలో హావెల్స్‌ ఇండియా కేబుల్‌ బిజినెస్‌ 24 శాతం ఎగసి రూ. 1,485 కోట్లను తాకగా.. స్విచ్‌గేర్స్‌ ఆదాయం 5 శాతం పుంజుకుని రూ. 541 కోట్లకు చేరింది. ౖ

ఫలితాల నేపథ్యంలో హావెల్స్‌ షేరు బీఎస్‌ఈలో 1 శాతం నీరసించి రూ. 1,348 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు