హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఫలితాలు బాగున్నాయ్‌

19 Jul, 2021 01:18 IST|Sakshi

నికర లాభం 14 శాతం అప్‌

క్యూ1లో రూ. 7,922 కోట్లు

స్వల్పంగా పెరిగిన ఎన్‌పీఏలు

బ్రోకరేజీ బిజినెస్‌ దూకుడు

ముంబై: ప్రయివేట్‌ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. క్యూ1(ఏప్రిల్‌–జూన్‌)లో స్టాండెలోన్‌ నికర లాభం రూ. 7,730 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 6,659 కోట్లు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన సైతం నికర లాభం 14 శాతం బలపడి రూ. 7,922 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం 8.6 శాతం పుంజుకుని రూ. 17,009 కోట్లయ్యింది.

అడ్వాన్సులు 14 శాతంపైగా వృద్ధి చూపగా.. నికర వడ్డీ ఆదాయం 4.1 శాతంగా నమోదైంది. ఇతర ఆదాయం 54 శాతం ఎగసి రూ. 4,075 కోట్లను తాకింది. గతేడాది క్యూ1లో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించగా.. తాజా సమీక్షా కాలంలోనూ స్థానిక లాక్‌డౌన్‌లు అమలైనట్లు బ్యాంక్‌ ఫలితాల విడుదల సందర్భంగా పేర్కొంది. దీంతో కొంతమేర కార్యకలాపాలు ప్రభావితమైనట్లు తెలియజేసింది. ఎంపిక చేసిన రుణ నష్టాలకు ప్రొవిజన్లు 54 శాతం పెరిగి రూ. 4,219 కోట్లకు చేరాయి. పక్కనపెట్టిన రూ. 600 కోట్ల కంటింజెన్సీలతో కలిపి మొత్తం ప్రొవిజన్లు రూ. 4,831 కోట్లను తాకాయి.  

1,23,473కు సిబ్బంది
జూన్‌ చివరికల్లా స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) గత క్యూ1తో పోలిస్తే 1.36 శాతం నుంచి 1.47 శాతానికి పెరిగాయి. రిటైల్‌ రుణాలు 9.3 శాతం, వాణిజ్య రుణాలు 25.1 శాతం, టోకు రుణాలు 10.2 శాతం చొప్పున ఎగశాయి. డిపాజిట్లు 13.2 శాతం వృద్ధి చూపాయి. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్‌) 19.1 శాతం, టైర్‌–1 క్యాపిటల్‌ 17.9 శాతంగా నమోదయ్యాయి. ఉద్యోగుల సంఖ్య గత జూన్‌లో 1,15,822కాగా.. తాజాగా 1,23,473కు చేరినట్లు బ్యాంక్‌ తెలియజేసింది. 5,653 బ్రాంచీలు, 16,291 ఏటీఎంలతో నెట్‌వర్క్‌ విస్తరించినట్లు వెల్లడించింది. అనుబంధ సంస్థలలో హెచ్‌డీబీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ నికర లాభం రూ. 233 కోట్ల నుంచి రూ. 131 కోట్లకు క్షీణించింది.  

ఆర్‌బీఐ తుది నిర్ణయం
ఆర్‌బీఐ ఆదేశాలకు అనుగుణంగా టెక్నాలజీని 85 శాతం మెరుగుపరచినట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఎండీ, సీఈవో శశిధరజగదీశన్‌ పేర్కొన్నారు. దీంతో కొత్త క్రెడిట్‌ కార్డుల జారీపై విధించిన నిషేధానికి సంబంధించి ఆర్‌బీఐ నిర్ణయం తీసుకోవలసి ఉన్నట్లు తెలియజేశారు. టెక్నాలజీ ఆడిట్‌సైతం పూర్తయినట్లు వెల్లడించారు. సాంకేతిక సమస్యల నేపథ్యంలో 2020 డిసెంబర్‌లో ఆర్‌బీఐ కొత్త కార్డుల జారీని నిలుపుదల చేయమంటూ ఆదేశించిన విషయం విదితమే.

కాగా.. అనుబంధ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ క్యూ1లో 67 శాతం అధికంగా రూ. 458 కోట్ల ఆదాయం సాధించినట్లు జగదీశన్‌ వెల్లడించారు. నికర లాభం 95 శాతం జంప్‌చేసి రూ. 261 కోట్లకు చేరినట్లు తెలియజేశారు. డిస్కౌంట్‌ బ్రోకింగ్‌ బిజినెస్‌లోకి ప్రవేశించినట్లు పేర్కొన్నారు. రానున్న రెండు, మూడేళ్లలో మార్కెట్‌ వాటాను పెంచుకునే లక్ష్యంతో ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు తెలియజేశారు. గత కొన్నేళ్లుగా ఇన్వెస్టర్లు చేపట్టే లావాదేవీలపై నామమాత్ర కమిషన్లు, ఫీజును తీసుకోవడం ద్వారా డిస్కౌంట్‌ బ్రోకరజీ బిజినెస్‌లు విస్తరిస్తున్నట్లు వివరించారు. దీంతో పలు సంస్థలు ఈ విభాగంపై దృష్టి సారిస్తున్నట్లు తెలియజేశారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు