ఐపీవో బాటలో ఓలా, ఫస్ట్‌క్రై

20 Dec, 2023 08:41 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహన కంపెనీ ఓలా, ఈకామర్స్‌ సంస్థ ఫస్ట్‌క్రై పబ్లిక్‌ ఇష్యూ బాటలో సాగుతున్నాయి. వచ్చే వారం క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఓలా ఎలక్ట్రిక్‌ యాజమాన్యం దేశ, విదేశీ ఇన్వెస్టర్లను ఆకట్టుకునేందుకు రోడ్‌షోలను నిర్వహిస్తోంది.

ఇక ఫస్ట్‌క్రై కొత్త ఏడాది(2024)లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల తదుపరి స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్ట్‌కావచ్చని అంచనా. పీఈ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్‌ రెండు సంస్థలలోనూ పెట్టుబడులున్న సంగతి తెలిసిందే. కాగా.. రెండు కంపెనీలూ వచ్చే వారం సెబీకి ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేసే సన్నాహాల్లో ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఐపీవో ద్వారా ఫస్ట్‌క్రై 50 కోట్ల డాలర్లు(సుమారు రూ. 4,150 కోట్లు) సమీకరించే అవకాశముంది.

సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం దీనిలో 60 శాతం వరకూ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనుండగా.. మిగిలిన 40 శాతం ఈక్విటీని కొత్తగా జారీ చేసే వీలుంది. కాగా.. రంజన్‌ పాయ్‌ కంపెనీ ఎంఈఎంజీ ఫ్యామిలీ ఆఫీస్, హర్ష్‌ మరియావాలా సంస్థ షార్ప్‌ వెంచర్స్, హేమేంద్ర కొఠారీ సంస్థ డీఎస్‌పీ ఫ్యామిలీ ఆఫీస్‌ ఇటీవలే ఫస్ట్‌క్రైలో రూ. 435 కోట్ల విలువైన  వాటాలను సొంతం చేసుకోవడం గమనార్హం!

>
మరిన్ని వార్తలు