టూర్స్‌ కోసం ఇండియన్స్‌ చేసే ఖర్చు ఇంతా..!

21 Oct, 2023 16:13 IST|Sakshi

2030నాటికి రూ.32లక్షల కోట్లని అంచనా

గత రెండేళ్లలో ప్రపంచవ్యాప్తంగా ప్రయాణాలు విపరీతంగా పెరిగాయి. కొవిడ్‌కారణంగా కుంటుపడిన టూరిజం నుంచి వచ్చే రాబడులు ఊపందుకుంటున్నాయి. అంతర్జాతీయంగా ఉన్న భయాలు తొలగి భారత్‌ నుంచి విదేశీ ప్రయాణాలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. ఈమధ్య భారతీయుల్లో టూర్స్ పట్ల ఉత్సాహం పెరుగుతోంది. ముఖ్యంగా నేటి యువతరం నాలుగు గోడల మధ్య బతకడానికి ఇష్టపడటం లేదు. ఖాళీ దొరికినప్పుడల్లా ట్రెక్కింగ్, విహారయాత్రలు, విదేశాలకు టూర్స్ ప్రణాళికలు వేస్తూ బిజీగా గడుపుతున్నారు. దాంతో దేశీయ పర్యాటక పరిశ్రమ వేగంగా దూసుకుపోతోంది. 

కొవిడ్‌ ముందు కంటే కూడా టూరిజం రంగంలో వస్తున్న ఆదాయం పెరుగుతుంది. కొవిడ్‌ మునుపుకంటే ప్రస్తుతం 173శాతం అధికంగా టూరిజం కోసం ఖర్చు చేస్తున్నారు. 2030 నాటికి భారత ట్రావెలర్స్‌ దాదాపు 410 బిలియన్‌ డాలర్లు(సుమారు రూ.32లక్షల ​కోట్లు) ఖర్చు చేయనున్నారని అంచనా. దాంతో ప్రపంచంలో పర్యాటకం కోసం అధికంగా వెచ్చించే నాలుగో దేశంగా ఇండియా నిలవనుందని గణాంకాలు చెబుతున్నాయి. 150 బిలియన్ డాలర్లు వెచ్చిస్తూ ఇండియా ప్రస్తుతం ప్రపంచంలో ఆరో స్థానంలో కొనసాగుతోందని హౌ ఇండియా ట్రావెల్స్ పేరిట బుకింగ్స్ డాట్ కామ్, మెకిన్సే & కంపెనీ సంయుక్తంగా ఓ నివేదికను విడుదల చేశాయి. 

ప్రపంచవ్యాప్తంగా అమెరికన్లు సగటున 63 రోజులు, జపాన్ ప్రజలు 57 రోజులతో పోలిస్తే భారతీయులు టూర్స్ కోసం 29 రోజులు వెచ్చిస్తున్నట్లు అధ్యయనంలో తేలింది. భారతీయ పర్యాటకుల్లో 80 శాతం మంది బస చేసేందుకు రెస్టారెంట్లు, రూమ్ సర్వీస్ కు ప్రాధాన్యం ఇస్తున్నట్లు నివేదిక పేర్కొంది. సంప్రదాయ మనాలీ, సిమ్లా వంటి ప్రాంతాలతో పాటు వారణాసి, గురుగ్రాం, కోయంబత్తూరు తరహా నగరాలకు వెళ్లే పర్యాటకుల సంఖ్య పెరుగుతూ వస్తున్నట్లు వెల్లడించింది.

గతేడాదికిగాను యూట్యూబ్‌ వీడియోలు చూసి తాము ట్రావెలింగ్ చేస్తున్నట్లు 91 శాతం మంది పర్యాటకులు చెప్పినట్లు బుకింగ్స్ డాట్ కామ్ నివేదిక పేర్కొంది. 85 శాతం మందిని ఇన్‌స్టాగ్రామ్ ప్రభావితం చేసినట్లు వెల్లడయింది. స్పోర్ట్స్, సమావేశాలు, మ్యూజికల్స్ వంటి ఇతర ఈవెంట్స్ పర్యాటకాభివృద్ధికి ఎంతో దోహదపడుతున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు