హెచ్‌పీసీఎల్‌, ఏంజెల్‌ బ్రోకింగ్‌.. భేష్‌

30 Oct, 2020 11:15 IST|Sakshi

సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు ప్రతిపాదన

5 శాతం జంప్‌చేసిన హిందుస్తాన్‌ పెట్రోలియం

కువైట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీ వాటా కొనుగోలు

17 శాతం దూసుకెళ్లిన ఏంజెల్‌ బ్రోకింగ్‌ షేరు

స్వల్ప ఆటుపోట్ల మధ్య ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు తదుపరి జోరందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 168 పాయింట్లు పెరిగి 39,918కు చేరగా.. నిఫ్టీ 63 పాయింట్లు బలపడి 11,734 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో సానుకూల వార్తల కారణంగా ఓవైపు ఇంధన రంగ పీఎస్‌యూ హిందుస్తాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌(హెచ్‌పీసీఎల్‌), మరోపక్క ఏంజెల్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్‌ కౌంటర్లు వెలుగులోకి వచ్చాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కంపెనీల షేర్లూ భారీ లాభాలతో దూకుడు చూపుతున్నాయి. వివరాలు చూద్దాం..

హెచ్‌పీసీఎల్
సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్‌)కు ప్రతిపాదించినట్లు చమురు రిఫైనరీ దిగ్గజం హెచ్‌పీసీఎల్‌ తాజాగా పేర్కొంది. ఈ అంశంపై వచ్చే నెల 4న(బుధవారం) సమావేశంకానున్న కంపెనీ బోర్డు చర్చించనున్నట్లు తెలియజేసింది. అదేరోజు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసిక ఫలితాలను సైతం విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌- జూన్‌)లో హెచ్‌పీసీఎల్‌ నికర లాభం 157 శాతం దూసుకెళ్లి రూ. 2,253 కోట్లకు చేరగా.. నికర అమ్మకాలు మాత్రం 47 శాతం క్షీణించి రూ. 37,559 కోట్లకు పరిమితమైన విషయం విదితమే. కాగా.. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో హెచ్‌పీసీఎల్‌ షేరు 5 శాతం జంప్‌చేసి రూ. 189 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 190 వరకూ పెరిగింది.

ఏంజెల్‌ బ్రోకింగ్‌
ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్‌)లో ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో ఇటీవల జోరు చూపుతున్న ఏంజెల్‌ బ్రోకింగ్‌ కౌంటర్‌కు మరోసారి డిమాండ్‌ నెలకొంది. కువైట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీ బల్క్‌డీల్‌ ద్వారా కంపెనీలో 0.53 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు వెల్లడికావడం దీనికి కారణమైంది. షేరుకి రూ. 321.73 ధరలో 4.3 లక్షల ఈక్విటీ షేర్లను సొంతం చేసుకున్నట్లు ఎన్‌ఎస్‌ఈ డేటా పేర్కొంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఏంజెల్‌ బ్రోకింగ్‌ షేరు 12.5 శాతం దూసుకెళ్లి రూ. 367 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 17 జంప్‌చేసి రూ. 379ను తాకింది. గత నాలుగు రోజుల్లో ఏంజెల్‌ బ్రోకింగ్‌ షేరు 52 శాతం ర్యాలీ చేసింది. ఇందుకు క్యూ2 ఫలితాలు దోహదం చేస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు. క్యూ2లో కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా దాదాపు రూ. 75 కోట్ల నికర లాభం ఆర్జించిన విషయం విదితమే.

మరిన్ని వార్తలు