ఉక్రెయిన్‌ - రష్యా యుద్ధం, భారత్‌ ఎకానమీపై భారీ ఎఫెక్ట్‌..ఎంతలా ఉందంటే!

30 Mar, 2022 08:30 IST|Sakshi

ముంబై: భారత్‌ ఎకానమీపై యుద్ధం ప్రభావం తీవ్రంగా ఉందని దేశీయ రేటింగ్స్‌ ఏజెన్సీ ఇక్రా అంచనావేసింది. ఏప్రిల్‌ 1తో ప్రారంభమయ్యే 2022–23 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి అంచనాలను 0.8 శాతం (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతం) తగ్గించింది. దీనితో క్రితం 7.8 శాతం అంచనాలు 7.2 శాతానికి తగ్గాయి. ఈ మేరకు విడుదలైన ఒక నివేదికలో ముఖ్యాంశాలు... 

కమోడీటీ ధరల పెరుగుదల ప్రధాన సమస్య. యుద్ధం నేపథ్యంలో తాజా సరఫరాల సమస్యలు తలెత్తుతున్నాయి.  

2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) అంచనాలు ప్రస్తు తం 7.8%గా ఉన్నాయి. ఏప్రిల్‌ మొదటి వారంలో జరగనున్న పాలసీ సమావేశాల్లో ఈ అంకెను తగ్గించే అవకాశం ఉంది.  

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో వృద్ధి రేటు 5.4% కాగా, నాల్గవ త్రైమాసికంలో (జనవరి–మార్చి 2022) ఈ రేటు 3 నుంచి 4 % మేరకే నమోదయ్యే వీలుంది. ఆర్థిక సంవత్సరం మొత్తంలో వృద్ధి రేటు 8.5%గా ఉంటుందని భావిస్తున్నాం.  

ఊహించినట్లుగానే మహమ్మారి కరోనా మొదటి, రెండవ వేవ్‌లతో పోల్చితే మూడవ వేవ్‌లో ఆర్థిక, ప్రాణ నష్టాలు చాలా తక్కువగానే నమోదయ్యాయి. 2022 మార్చి ప్రారంభంలో ఆర్థిక  డేటా మిశ్రమంగా ఉన్నప్పటికీ, రష్యా–ఉక్రెయిన్‌ వివాదం, వస్తువుల ధరలలో పెరుగుదల  ఎకానమీలో అనిశ్చితిని పెంచిం ది. పలు కంపెనీల ఉత్పత్తులపై ఈ ప్రభావం తీవ్రంగా ఉంది. 

ఇంధనం, వంట నూనెల వంటి వస్తువుల అధిక ధరలు మధ్య, దిగువ స్థాయి ఆదాయ వర్గాల విచక్షణ రహిత వ్యయాలను తగ్గించే అవకాశం ఉంది. ఆయా పరిస్థితులు వచ్చే ఆర్థిక సంవత్సరం డిమాండ్‌ పునరుద్ధరణను అడ్డుకుంటుంది.  

సెప్టెంబరు 2022 వరకు ఉచిత ఆహారధాన్యాల పథకం పొడిగింపు హర్షణీయం. బలహీన  ఆర్థిక కుటుంబాల ఆహార బడ్జెట్‌లకు ఇది కొంత ఉపశమనం కలిగిస్తుంది.   

భారత్‌ ఎగుమతుల విషయానికి వస్తే, మూడవ త్రైమాసికంతో పోల్చితే నాల్గవ త్రైమాసికంలో (జనవరి–మార్చి) సామర్థ్య వినియోగ స్థాయిలు 72% నుంచి 75%కి పెరిగింది.  
 
2022–23 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో (ఏప్రిల్‌–సెప్టెంబర్‌) ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోడానికి కేంద్ర మూలధన వ్యయాలు కీలకంగా 
మారనున్నాయి.  

ఎకానమీలో వివిధ రంగాల్లో పలు స్థాయిల్లో (కే నమూనాలో) రికవరీ చోటుచేసుకునే అవకాశం ఉంది. సామాజిక, ఆర్థిక అసమానతలు కొనసాగుతాయి.  

వ్యవసాయంలో వృద్ధి 3 % లోపే... 
ఇక్రా నివేదిక ప్రకారం, 2022లో రిజర్వాయర్‌ స్థాయిలు బాగున్నాయి. దీనివల్ల సాధారణం కంటే తక్కువ వర్షపాతం పడినా, వ్యవసాయ రంగంపై అంతగా ప్రతికూల ప్రభావం చూపకపోవచ్చు. అయితే ఎరువుల కొరత వ్యవ సాయ రంగానికి ఆందోళన కలిగించే అంశం. అంతర్జాతీ య మార్కెట్‌లో పరిమిత లభ్యత, పెరిగిన ధరలు,  తక్కువ దిగుమతులు వంటి అంశాలు వ్యవసాయ రం గంపై ప్రతికూలత చూపే అవకాశం ఉంది. అందువల్ల తగిన రిజర్వాయర్‌ స్థాయిలు, సాధారణ వర్షపాతం ఉన్నప్పటికీ, వ్యవసాయ ఉత్పత్తులు భారీగా పెరిగే అవకాశం లేదు. స్థూల దేశీయోత్పత్తిలో దాదాపు 14 శాతం వాటా ఉన్న వ్యవసాయ రంగంలో 2022–23 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 3%కన్నా తక్కువగా నమోదయ్యే వీలుంది.  

మరిన్ని వార్తలు