India To Bharat: దేశం పేరు మారితే ఎన్ని వేలకోట్లు ఖర్చవుతుందంటే? విస్తుపోయే నిజాలు..

8 Sep, 2023 07:42 IST|Sakshi

గత కొన్ని రోజుల నుంచి ఇండియా పేరుని భారత్‌‌గా మార్చాలనే ఆలోచనలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. దీని కోసం 2023 సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఆగస్టు 31న ప్రకటించారు. అయితే ఇండియా పేరు భారత్‌‌గా మారిస్తే.. ఎలాంటి ఆర్థిక పరిణామాలు ఎదురవుతాయనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఔట్‌లుక్ బిజినెస్ నివేదికల ప్రకారం, ఇండియా భారత్‌‌గా మారాలంటే ఏకంగా రూ. 14 వేలకోట్లు ఖర్చవుతుందని తెలుస్తోంది. ఎందుకంటే గతంలో కొన్ని దేశాలు పేర్లు మార్చుకోవడం వల్ల ఎంత ఖర్చయింది అనే వివరాల ఆధారంగా ఇంత పెద్ద మొత్తం ఖర్చు అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.

2018లో ఆఫ్రికాలోని స్వాజిల్యాండ్ దేశం పేరుని ఎస్వంటిని (Eswantini)గా మార్చడానికి సుమారు 60 మిలియన్ డాలర్లు ఖర్చయినట్లు ప్రముఖ న్యాయవాది 'డారెన్ అలివర్' గణాంకాలు వెల్లడించాయి. అంతే కాకుండా ఈయన ప్రకారం ఒక పెద్ద దేశం సగటు మార్కెటింగ్ బడ్జెట్ దాని మొత్తం ఆదాయంలో దాదాపు 6 శాతం వరకు ఉంటుంది. కాగా రీబ్రాండింగ్ కోసం మొత్తం మార్కెటింగ్ బడ్జెట్‌లో 10 శాతం వరకు ఖర్చవుతుంది.

అలివర్ సూత్రం ప్రకారం.. 
2022-23 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ ఆదాయం మొత్తం రూ.23.84 లక్షల కోట్లు. కావున అలివర్ (Oliver) సూత్రం ప్రకారం రూ. 23.84 లక్షల కోట్లు × 0.006 = రూ. 14,304 కోట్లు (రీబ్రాండింగ్ మొత్తం). ఈ విధంగా భారత్ పేరుగా ఇండియా స్థిరపడాలంటే వేలకోట్లు ఖర్చవుతుందని చెబుతున్నారు.

ఇండియా అన్న పేరుని భారత్‌‌గా మార్చితే.. ఇండియా పేరు ఉన్న ప్రతి చోటా (కరెన్సీ నోట్ల మీద, ఆధార్, పాన్, ప్రభుత్వ సంస్థలు ఇలా) భారత్ అనే పదం చేర్చాలి వస్తుందని, ఇది ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని అని నిపుణులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: ఇలా అయితే ఎలా గురూ.. కేవలం 48 గంటల్లో అన్నీ బుక్కయిపోయాయ్!

ఇప్పటికే భారతదేశంలోని కొన్ని నగరాల పేర్లు కూడా మార్చడం జరిగింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నగరం ఛత్రపతి శంభాజీనగర్‌గా.. హోషంగాబాద్ 2021లో నర్మదాపురంగా, ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ నగరం 2018లో ప్రయాగ్‌రాజ్‌గా పేరు మార్చింది. అలహాబాద్ పేరు మార్చడం వల్ల ఆ రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 300 కోట్లకు పైనే ఖర్చు అయినట్లు ఇండియా టుడే గతంలో నివేదించింది. ఈ లెక్క ప్రకారం ఇండియా.. భారత్‌‌గా మారితే ఎన్ని వేలకోట్లు ఖర్చు అవుతుందో ఊహించవచ్చు.

మరిన్ని వార్తలు