ఫిన్‌టెక్‌ డీల్స్‌లో చైనాను మించిన భారత్‌

18 Feb, 2021 05:19 IST|Sakshi

2020 జూన్‌ క్వార్టర్‌లో 33 ఒప్పందాలు

విలువ 647 మిలియన్‌ డాలర్లు

కోల్‌కతా: ఆసియా ఖండంలో ఫైనాన్షియల్‌ టెక్నాలజీ (ఫిన్‌టెక్‌) డీల్స్‌కు భారత్‌ ప్రధాన కేంద్రంగా ఆవిర్భవిస్తోంది. ఈ విషయంలో 2020 జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో చైనాను కూడా అధిగమించింది. ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ సేవల సంస్థ ఆర్‌బీఎస్‌ఏ అడ్వైజర్స్‌ విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.  దీని ప్రకారం గతేడాది జూన్‌ 30తో ముగిసిన త్రైమాసికంలో భారత్‌లో 33 డీల్స్‌ నమోదయ్యాయి. వీటి విలువ 647.5 మిలియన్‌ డాలర్లు. ఇదే సమయంలో చైనాలో 284.9 మిలియన్‌ డాలర్ల విలువ చేసే ఫిన్‌టెక్‌ డీల్స్‌ మాత్రమే నమోదయ్యాయి. ‘కరోనా వైరస్‌పరమైన ప్రతికూల పరిస్థితుల్లోనూ 2020 ప్రథమార్ధంలో భారత్‌లోకి ఫిన్‌టెక్‌ పెట్టుబడులు 60 శాతం పెరిగాయి. దేశీయంగా ఈ పరిశ్రమ ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నప్పటికీ .. రాబోయే రోజుల్లో మరింతగా వృద్ధి చెందగలదు. డిజిటల్‌ రుణాలు తదితర విభాగాలపై ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశం ఉంది‘ అని ఆర్‌బీఎస్‌ఏ అడ్వైజర్స్‌ ఎండీ రాజీవ్‌ షా తెలిపారు.

నాలుగున్నరేళ్లలో 10 బిలియన్‌ డాలర్లు..
గడిచిన నాలుగున్నరేళ్లలో (2016 నుంచి 2020 ప్రథమార్ధం దాకా) దేశీ ఫిన్‌టెక్‌ రంగంలోకి 10 బిలియన్‌ డాలర్ల పైగా పెట్టుబడులు వచ్చాయి. చాలా మటుకు ఫైనాన్షియల్‌ టెక్నాలజీ సంస్థల ప్రధాన కార్యాలయాల కేంద్రాలుగా బెంగళూరు, ముంబై టాప్‌లో ఉన్నాయి. దేశీయంగా మొత్తం 21 యూనికార్న్‌లు ఉండగా (1 బిలియన్‌ డాలర్ల వేల్యుయేషన్‌ సాధించిన సంస్థలు), వీటిలో మూడింట ఒక వంతు ఫిన్‌టెక్‌ సంస్థలే ఉన్నాయి. డిజిటల్‌ చెల్లింపుల సంస్థ పేటీఎం 16 బిలియన్‌ డాలర్ల వేల్యుయేషన్‌తో అగ్రస్థానంలో ఉంది.

మరిన్ని వార్తలు