మందగించిన మౌలికం.. తొమ్మిది నెలల కనిష్ట స్థాయి, కారణం ఇదే

1 Oct, 2022 07:43 IST|Sakshi

ఆగస్టులో వృద్ధి 3.3 శాతం

న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ఎనిమిది మౌలిక రంగాల గ్రూప్‌ వృద్ధి ఆగస్టులో మందగించింది. 3.3 శాతానికి పరిమితమైంది. ఇది తొమ్మిది నెలల కనిష్ట స్థాయి కావడం గమనార్హం. చివరిసారిగా 2021 నవంబర్‌లో వృద్ధి 3.2 శాతంగా ఉండగా, గతేడాది ఇదే వ్యవధిలో 12.2 శాతంగాను నమోదైంది. ఈ ఏడాది జూలైలో ఇది 9.8 శాతంగా ఉంది. ఆగస్టులో క్రూడాయిల్‌ ఉత్పత్తి 3.3 శాతం, నేచురల్‌ గ్యాస్‌ ఉత్పత్తి 0.9 శాతం క్షీణించింది.

గతేడాది ఆగస్టులో 3.1 శాతం క్షీణించిన ఎరువుల ఉత్పత్తి 11.9 శాతం పెరిగింది. బొగ్గు ఉత్పత్తి 7.6 శాతానికి, రిఫైనరీ ఉత్పత్తుల తయారీ 7 శాతానికి, ఉక్కు (2.2%), సిమెంట్‌  (1.8 శాతం), విద్యుత్‌ (0.9 శాతం) విభాగాలు మందగించాయి. బేస్‌ సాధారణ స్థాయికి తిరిగి వస్తుండటం, భారీ వర్షాల కారణంగా నిర్మాణ రంగ కార్యకలాపాలు నిల్చిపోవడం, విద్యుత్‌కి డిమాండ్‌ తగ్గడం తదితర అంశాలు ఆగస్టులో మౌలిక రంగాల వృద్ధిని దెబ్బతీసినట్లు ఇక్రా చీఫ్‌ ఎకానమిస్ట్‌ అదితి నాయర్‌ తెలిపారు.

చదవండి: స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాల్లో కొత్త రూల్స్‌ వచ్చాయ్‌.. ఇది తప్పనిసరి!

మరిన్ని వార్తలు