తొలి మానవసహిత "సముద్రయాన్‌" మిషన్‌ ప్రారంభించిన కేంద్రం

31 Oct, 2021 17:13 IST|Sakshi

సముద్ర గర్భంలో పరిశోధన కోసం భారతదేశం తన తొలి మానవసహిత సముద్ర మిషన్​ 'సముద్రయాన్​' ప్రారంభించింది. దీంతో సముద్ర జలాల లోపల కార్యకలాపాలు సాగించే వాహనాలు కలిగి ఉన్న యుఎస్ఎ, రష్యా, జపాన్, ఫ్రాన్స్, చైనా  దేశాల జాబితాలో భారత్​ చేరింది.  చెన్నైలో ఈ మిషన్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. సైన్స్ అండ్ టెక్నాలజీలో భారతదేశం గొప్ప పురోగతి సాధించిందని, గగన్ యాన్ కార్యక్రమంలో భాగంగా ఒక భారతీయుడు అంతరిక్షంలోకి వెళ్తుంటే, మరొకరు సముద్రంలోకి అడుగుభాగనికి వెళ్లబోతున్నారని పేర్కొన్నారు.

ప్రస్తుతం జలాంతర్గాములు సైతం సముద్రంలో 200 మీటర్ల లోతుకు మించి వెళ్లలేవు. కానీ మన సైంటిస్టులు ఏకంగా 6 వేల మీటర్ల లోతుకు ముగ్గురు సైంటిస్టులను, రోబోటిక్ పరికరాలను పంపేందుకు సిద్ధమవుతున్నారు! ఇందుకు అత్యంత ముఖ్యమైన క్రూ మాడ్యూల్ డిజైన్ కూడా పూర్తి చేశారు. దీంతో వందల కోట్లతో చేపట్టబోయే ఈ మిషన్ లో కీలక ముందడుగు పడినట్లయింది. ఈ మాడ్యూల్ డిజైన్ కు ఇస్రో అత్యంత క్లిష్టమైన టెక్నాలజీని వాడినట్లు చెప్పారు. గోళాకారంలో ఉండే ఈ చిన్న సబ్ మెర్సిబుల్ వెహికిల్ తయారీకి టైటానియం లోహాన్ని వాడనున్నట్లు తెలిపారు. సముద్ర గర్భంలో ఉన్న ఖనిజాలు, ఇంధన వనరులను వెతికిపట్టుకోవడం బ్లూ ఎకానమీకి దోహదం చేస్తుంది. సముద్రగర్భంలో ఉన్న జీవజాలంపై అధ్యయనం చేస్తారు.

సముద్రయాన్ గురించి ఆసక్తికర విషయాలు:

  • నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ(ఎన్ఐఓటీ) చేపట్టిన ₹6,000 కోట్ల సముద్రయన్ ప్రాజెక్టు డీప్ ఓషన్ మిషన్ లో ఒక భాగం.
  • సముద్రయాన్ ప్రాజెక్టు కోసం సముద్ర వాహనం అయిన మత్స్య 6000 రూపొందించారు. 
  • 2.1 మీటర్ల వ్యాసం కలిగిన ఈ టైటానియం గోళంలో ముగ్గురు సైంటిస్టులు సముద్ర అడుగుభాగనికి వెళ్లనున్నారు. 
  • క్రూ మాడ్యూల్ కనీసం 72 గంటల పాటు సముద్రం అడుగున అత్యంత తీవ్రమైన ప్రెజర్ ను తట్టుకుని ఉండగలిగేలా తయారు చేస్తున్నారు.
  • సముద్రంలో దాదాపు 6 కిలోమీటర్ల లోతు వరకూ వెళ్లి అక్కడ సముద్రం అడుగున అనేక అంశాలను స్టడీ చేయనున్నారు.
  • సముద్ర గర్భంలో ఉన్న పాలీమెటాలిక్ మాంగనీస్ నోడ్యూల్స్, గ్యాస్ హైడ్రేట్స్, హైడ్రో థర్మల్ సల్ఫైడ్స్, కోబాల్ట్ క్రస్ట్లు వంటి నాన్ లివింగ్ వనరుల అన్వేషణ కోసం ఈ ప్రాజెక్టు చెప్పటినట్లు తెలుస్తుంది. 
  • ఐరన్, మాంగనీస్, నికెల్, కాపర్, కోబాల్ట్ తో కూడిన ముడి ఖనిజాలనే పాలీమెటాలిక్ నాడ్యూల్స్ అంటారు. 
  • మనం ఈ ఖనిజ సంపదలో కేవలం 10 శాతం తెచ్చుకోగలిగినా.. ఇండియాకు వందేళ్ల పాటు ఇంధన అవసరాలు తీరిపోతాయట!.
  • ఎన్ఐఓటీ అధికారిక సమాచార ప్రకారం.. మత్స్య 6000 డిసెంబర్ 2024 నాటికి ట్రయల్స్ కోసం సిద్ధంగా ఉంటుంది. 
  • కేంద్ర భూశాస్త్రా మంత్రిత్వ శాఖ 5 సంవత్సరాల కాలానికి మొత్తం ₹4,077 కోట్ల బడ్జెట్తో అమలు చేయాల్సిన డీప్ ఓషన్ మిషన్ కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
మరిన్ని వార్తలు