గ్యాస్‌ ఇన్‌ఫ్రాపై 60 బిలియన్‌ డాలర్లు

18 Dec, 2020 03:06 IST|Sakshi

2024 నాటికి పెట్టుబడుల లక్ష్యం

కేంద్ర చమురు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెల్లడి  

న్యూఢిల్లీ: దేశీయంగా గ్యాస్‌ మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు 2024 నాటికి 60 బిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టాలని కేంద్రం భావిస్తున్నట్లు కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెల్లడించారు. 2030 నాటికి మొత్తం ఇంధనాల వినియోగంలో గ్యాస్‌ వాటాను 15 శాతానికి పెంచుకునే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఇది 6 శాతంగా ఉంది. ‘పైప్‌లైన్లు, ద్రవీకృత సహజ వాయువు (ఎల్‌ఎన్‌జీ) టెర్మినల్స్, సిటీ గ్యాస్‌ పంపిణీ (సీజీడీ) నెట్‌వర్క్‌లు మొదలైన గ్యాస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై 2024 నాటికి 60 బిలియన్‌ డాలర్ల మేర ఇన్వెస్ట్‌ చేయాలని నిర్దేశించుకున్నాం.

గ్యాస్‌ ఆధారిత ఎకానమీగా భారత్‌ను తీర్చిదిద్దే దిశగా లక్ష్యాలు పెట్టుకున్నాం‘ అని అసోచాం ఫౌండేషన్‌ డే వీక్‌ 2020 కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి తెలిపారు. సీజీడీ ప్రాజెక్టులను 400 జిల్లాల్లోని 232 ప్రాంతాలకు విస్తరిస్తున్నట్లు ఆయన వివరించారు. దీంతో భౌగోళికంగా 53 శాతం ప్రాంతాల్లో, దేశ జనాభాలో 70 శాతం మందికి సీజీడీ అందుబాటులోకి రాగలదని ప్రధాన్‌ పేర్కొన్నారు. మరోవైపు, దేశవ్యాప్తంగా 1,000 ఎల్‌ఎన్‌జీ ఫ్యూయల్‌ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. గత నెలలలోనే తొలిసారిగా 50 ఎల్‌ఎన్‌జీ ఇంధన స్టేషన్లకు శంకుస్థాపన చేసినట్లు మంత్రి వివరించారు. ప్రభుత్వ–ప్రైవేట్‌ భాగస్వామ్య విధానంలో చండికోల్, పాదూర్‌లలో మరో 6.5 మిలియన్‌ టన్నుల వాణిజ్య–వ్యూహాత్మక పెట్రోలియం స్టోరేజ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసే ప్రక్రియ ప్రారంభించినట్లు  తెలిపారు.

మరిన్ని వార్తలు