టాటా గ్రూప్‌నకు ఎల్‌వోఐ

12 Oct, 2021 03:40 IST|Sakshi

రెండు వారాల్లోగా ఎస్‌పీఏపై సంతకాలకు అవకాశం

ప్రభుత్వ రంగ విమానయాన దిగ్గజం ఎయిరిండియాను టాటా గ్రూప్‌నకు విక్రయించడాన్ని నిర్ధారిస్తూ కేంద్రం సోమవారం లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ను (ఎల్‌వోఐ) జారీ చేసిందని∙పాండే తెలిపారు. టాటా గ్రూప్‌ దీనికి తమ అంగీకారం తెలిపిన తర్వాత వాటాల కొనుగోలు ఒప్పందంపై (ఎస్‌పీఏ) సంతకాలు అవుతాయి. ‘సాధారణంగా ఎల్‌వోఐని అంగీకరించిన తర్వాత 14 రోజుల్లోగా ఎస్‌పీఏపై సంతకాలు జరుగుతాయి. ఇది సాధ్యమైనంత వేగంగా పూర్తి కాగలదని ఆశిస్తున్నాం‘ అని పాండే పేర్కొన్నారు. డిసెంబర్‌ ఆఖరు నాటికి డీల్‌ పూర్తి కావాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఎస్‌పీఏ కుదుర్చుకున్నాక, నియంత్రణ అనుమతులు రావాలని, ఆ తర్వాత ఎయిరిండియా అప్పగింత ప్రక్రియ మొదలవుతుందని ఆయన చెప్పారు.

‘వారు అంగీకార పత్రం (ఎల్‌వోఏ) సమరి్పంచేటప్పుడు అంచనా విలువలో 1.5 శాతం (సుమారు రూ. 270 కోట్లు) సెక్యూరిటీ కింద ఇవ్వాల్సి ఉంటుంది. ఎల్‌వోఐతో పాటు బ్యాంక్‌ గ్యారంటీ రూపంలో పేమెంట్‌ సెక్యూరిటీని అందించాలి‘ అని పాండే తెలిపారు. ఇక డీల్‌లో భాగమైన నగదు లావాదేవీ విషయానికొస్తే.. డిసెంబర్‌ ఆఖరు నాటికి సంస్థను అప్పగించే రోజున జరుగుతుందని వివరించారు. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఎయిరిండియాను బిడ్డింగ్‌లో టాటా గ్రూప్‌ రూ. 18,000 కోట్లకు దక్కించుకున్న సంగతి తెలిసిందే. టాటా గ్రూప్‌లో ఇది మూడో విమానయాన సంస్థ కానుంది. టాటా గ్రూప్‌ ఇప్పటికే విస్తారా, ఎయిర్‌ ఏషియా విమానయాన సంస్థలను నిర్వహిస్తోంది. వీటికి ఎయిరిండియా కూడా తోడైతే టాటా గ్రూప్‌ మార్కెట్‌ వాటా 26.9 శాతానికి చేరుతుంది. ఇండిగో తర్వాత దేశీయంగా రెండో అతి పెద్ద ఎయిర్‌లైన్స్‌గా నిలుస్తుంది.

మరిన్ని వార్తలు