35పై.లకే 10 లక్షల ఇన్సూరెన్స్‌.. ట్రైన్‌ టికెట్‌ బుక్‌ చేసుకునేప్పుడు ఆ ఆప్షన్‌ మీద క్లిక్‌ చేయడం మరవద్దు

2 Dec, 2021 12:10 IST|Sakshi

Indian Railway IRCTC Passengers 10 Lakh Insurance For 35 Paise: దూర ప్రయాణాలు చేసేవాళ్లకు రైల్‌ రిజర్వేషన్‌ ప్రయాణం సౌకర్యంగా ఉంటుంది.  చేతిలో ఉండే స్మార్ట్‌ ఫోన్‌ టికెట్‌ బుక్‌ చేసుకోవడం మొదలు..  నచ్చిన సీటును ఎంచుకోవడం, టైంకి తిండి, టైంకి జర్నీ, టాయిలెట్‌ సౌకర్యం.. ఇలా ఉంటాయి. అదే టైంలో మీ టికెట్‌ ఛార్జీలో కేవలం35 పైసలకే రూ.10 లక్షల వరకు ఇన్సూరెన్స్ ఇస్తుందన్న సంగతి మీకు తెలుసా? ఆ వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 


ఐటీఆర్‌సీటీసీ (IRCTC) వెబ్‌సైట్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకునే సమయంలో భారతీయ రైల్వే కేవలం 35 పైసలు.. అదీ జీరో ప్రీమియంతో రైలులో ప్రయాణించే వ్యక్తులకు రూ. 10 లక్షల వరకు బీమా రక్షణను అందిస్తోంది.  ఏదైనా ప్రమాదం జరిగిన పరిస్థితుల్లో ప్రయాణికుల కుటుంబానికి ఆసరాగా నిలబడేందుకు కారుచౌకగా ఈ బీమాను అందిస్తోంది రైల్వే శాఖ.

క్లిక్‌ చేస్తే చాలు!
IRCTC ద్వారా మీ రైలు టిక్కెట్‌ను బుక్ చేసేటప్పుడు మీకు ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆప్షన్ కనిపిస్తుంది. మీరు ఈ ఆప్షన్‌ను ఎంచుకుంటే బీమా కవర్ ఇవ్వబడుతుంది. అదే సమయంలో PNR నంబర్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణీకులందరికీ ఈ బీమా వర్తిస్తుంది.

వేటికి వర్తింపు అంటే..
శాశ్వత పాక్షిక వైకల్యం, శాశ్వత వైకల్యం, రైలు ప్రమాదాల సమయంలో ఆసుపత్రి ఖర్చులు, ప్రయాణ సమయంలో మరణం, మృతదేహాల రవాణా కోసం.. వర్తిస్తుంది. ఉగ్రదాడులు, దోపిడీ-దాడులు, కాల్పుల ఘటనలు, ప్రమాదవశాత్తూ రైలు నుంచి కింద పడిపోవడం లాంటి ప్రమాదాలు ఒక కేటగిరీలో, రెండు రైళ్లు ఢీకొట్టినప్పుడు, రైలు ప్రయాణం మొదలైనప్పటి నుంచి గమ్యస్థానం చేరేలోపు రైలు ఎలాంటి ప్రమాదానికి గురైనా ఈ ఇన్సూరెన్స్‌ వర్తిస్తుంది.  

ఎంత బీమా పొందే అవకాశం ఉంటుంది?
ఆసుపత్రిలో చికిత్సలకు రూ.2 లక్షల కవరేజీ, శాశ్వత పాక్షిక వైకల్యానికి రూ.7.5 లక్షల కవరేజీ, మృత దేహాలను రవాణా చేసేందుకు రూ.10 వేల కవరేజీ, రైలు ప్రమాదం లేదా రైలు ప్రయాణంలో ఏదైనా అవాంఛనీయ సంఘటన కారణంగా మరణించినా.. శాశ్వతంగా వైకల్యం బారినపడ్డా కూడా రూ.10 లక్షల కవరేజీ వర్తిస్తుంది. 

ప్రమాదాలు ఎప్పుడు ఎటు నుంచి పొంచి ఉంటాయో ఊహించలేం. కాబట్టి, ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తల ద్వారా భవిష్యత్తులో కుటుంబాలకు అండగా నిలబడవచ్చు. 

మరిన్ని వార్తలు