Indian Economy: ఆందోళన కలిగిస్తున్న సెకండ్‌వేవ్‌

29 Apr, 2021 00:05 IST|Sakshi

ఏడీబీ 2021 అవుట్‌లుక్‌

న్యూఢిల్లీ: భారత్‌లో సెకండ్‌వేవ్‌ అందోళన కలిగిస్తోందని బుధవారం ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏడీబీ) 2021 అవుట్‌లుక్‌ పేర్కొంది. ఆర్థిక వ్యవస్థ పటిష్ట రికవరీకి ఇది అడ్డంకిగా మరుతోందని తెలిపింది. అయితే 2022 మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరంలో 11 శాతం ఎకానమీ వృద్ధి నమోదవుతుందని అంచనావేస్తున్నట్లు తెలిపింది. వ్యాక్సినేషన్‌ కార్యక్రమం అమలు జరుగుతుండడం, రానున్న నెలల్లో ఈ కార్యక్రమం మరింత విస్తృతం కావడానికి చర్యలు తన వృద్ధి అంచనాలకు కారణమని పేర్కొంది. మనీలా ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న బహుళజాతి బ్యాంకింగ్‌ సంస్థ ఏడీబీ తాజా ‘అవుట్‌లుక్‌’ లో మరికొన్ని అంశాలను పరిశీలిస్తే.. 

►మౌలిక రంగంలో పెట్టుబడులు, తయారీ రంగానికి ప్రోత్సాహకాలు, గ్రామీణ ఆదాయాలకు చేయూత వంటి కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ వ్యయాలు పెరుగుతున్నాయి. వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభమైంది. దేశీయ డిమాండ్‌ మెరుగ్గానే ఉంది. ఆయా అంశాలు ఆర్థిక రంగాన్ని పట్టాలు తప్పనీయకపోవచ్చు. అయితే వ్యాక్సినేషన్‌ దేశ వ్యాప్తంగా విస్తృతంగా పంపిణీ అవుతుందని, తద్వారా సెకండ్‌వేవ్‌ కట్టడి జరుగుతుందన్న అంచనాలే తాజా అవుట్‌లుక్‌కు ప్రాతిపదిక. కాగా, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతంలో లోపాలు ఉన్నా, మహమ్మారి కట్టడిలో అది విఫలమైనాకోవిడ్‌–19 కేసుల పెరుగుదల ఆందోళనకరంగా మారుతుంది.

►దీనికితోడు అంతర్జాతీయ ఫైనాన్షియల్‌ పరిస్థితులు మరింత కఠినతరంగా మారే అవకాశం ఉండడం భారత్‌కు ఆందోళకరం. ఆయా అంశాలు దేశీయ మార్కెట్‌ వడ్డీరేట్ల పెరుగుదలకు దారితీస్తుంది. ఇదే జరిగితే ఆర్థికరంగం సాధారణ స్థితికి చేరుకోవడానికి అడ్డంకులు ఏర్పడతాయి.

►2021–22లో 11 శాతం వృద్ధి అంచనాకు బేస్‌ ఎఫెక్ట్‌ (2020–21లో తక్కువ స్థాయి గణాంకాల)ప్రధాన కారణం. బేస్‌ ఎఫెక్ట్‌ను పరిగణనలోకి తీసుకోకపోతే 7 శాతం వృద్ధి ఉంటుంది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో 8 శాతం క్షీణత నమోదయ్యే అవకాశం ఉంది.

►ఆరోగ్యం, నీటి సరఫరా, పారిశుధ్యం వంటి రంగాల్లో ప్రభుత్వ వ్యయాలు పెరగాలి. దీనివల్ల భవిష్యత్తులో తలెత్తే మహమ్మారి సంబంధ సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ప్రైవేటు పెట్టుబడులు పెరగడం, తగిన రుణ పరిస్థితులు ఉండడం ప్రస్తుతం దేశానికి తక్షణ అవసరం.

►ద్రవ్యోల్బణం వార్షిక సగటు 6.2 శాతం నుంచి 5.2 శాతానికి తగ్గవచ్చు. తగిన వర్షపాతం, పంట సాగు, సరఫరాల చైన్‌ మెరుగుపడే అవకాశాలు దీనికి కారణం.

►ఇక దక్షిణ ఆసియా పరిస్థితిని పరిశీలిస్తే, 2021 క్యాలెండర్‌ ఇయర్‌లో ఉత్పత్తి వృద్ధి 9.5 శాతంగా ఉండే వీలుంది. 2022లో ఇది 6.6 శాతానికి తగ్గవచ్చు. ఆసియా మొత్తంగా వృద్ధి ధోరణి మెరుగుపడుతున్నప్పటికీ, కోవిడ్‌–19 కేసుల పెరుగుదల రికవరీకి ఇబ్బందిగా మారుతోంది.

►ఒక్క చైనా విషయానికివస్తే, ఎగుమతులు పటిష్టంగా ఉన్నాయి. గృహ వినియోగంలో రికవరీ క్రమంగా పెరుగుతోంది. 2021లో చైనా ఎకానమీ 8.1 శాతం వృద్ధిని నమోదుచేసుకునే వీలుంది. 2022లో ఇది 5.5 శాతానికి తగ్గవచ్చు. 

►సెంట్రల్‌ ఆసియా, తూర్పు ఆసియా, దక్షిణ ఆసియా, ఆగ్నేయ ఆసియా, పసిఫిక్‌ ప్రాంత దేశాలుసహా ఏడీబీలో ప్రస్తుతం 46 సభ్య దేశాలు ఉన్నాయి. 

మరిన్ని వార్తలు