ఇండస్‌ ఇండ్‌ ఫలితాలు ఆకర్షణీయం!

21 Jul, 2022 10:29 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇండస్‌ఇండ్‌ బ్యాంకు జూన్‌ త్రైమాసికంలో మంచి పనితీరు చూపించింది. నికర లాభం 61 శాతం పెరిగి రూ.1,631 కోట్లుగా నమోదైంది. మొండి బకాయిలు తగ్గుముఖం పట్టాయి. బ్యాంకు ఆదాయం సైతం రూ.10,113 కోట్లకు పెరిగింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నికర లాభం రూ.1,016 కోట్లు, ఆదాయం రూ.9,298 కోట్లుగా ఉన్నాయి. వడ్డీ ఆదాయం 9.5 శాతం పెరిగి రూ.8,182 కోట్లకు చేరింది. స్థూల నినర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు) మొత్తం రుణాల్లో 2.35 శాతంగా ఉన్నాయి.

అంతక్రితం ఏడాది జూన్‌ త్రైమాసికం చివరి నాటికి ఉన్న 2.88 శాతంతో చూస్తే కొంచెం తగ్గాయి. నికర ఎన్‌పీఏలు 0.84 శాతం (రూ.1,760 కోట్లు) నుంచి 0.67 శాతానికి (రూ.1,661 కోట్లు) క్షీణించాయి. మార్చి త్రైమాసికం చివరికి ఉన్న నికర ఎన్‌పీఏలు 0.64 శాతం (రూ.1,530 కోట్లు)తో పోల్చి చూస్తే స్వల్పంగా పెరిగాయి. ప్రొవిజన్లు, కంటెంజెన్సీలకు చేసిన కేటాయింపులు తగ్గినట్టు ఇండస్‌ఇండ్‌ బ్యాంకు ప్రకటించింది.

జూన్‌ త్రైమాసికంలో రూ.1,251 కోట్లను కేటాయించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.1,779 కోట్లను కేటాయించడం గమనించాలి. ఈ ఏడాది మార్చితో ముగిసిన త్రైమాసికంలో కేటాయింపులు రూ.1,461 కోట్లుగా బీఎస్‌ఈలో బ్యాంకు షేరు ఒక శాతం లాభంతో రూ.879 వద్ద క్లోజయింది.

మరిన్ని వార్తలు