లైఫ్‌కి ఇన్సురెన్స్‌ ఉండాలంతే!

11 May, 2022 10:52 IST|Sakshi

జీవిత బీమా కొత్త ప్రీమియం జోరు 

ఏప్రిల్‌లో 84 శాతం అధికం 

రూ.17,940 కోట్ల ఆదాయం 

141% వృద్ధి సాధించిన ఎల్‌ఐసీ  

న్యూఢిల్లీ: జీవిత బీమా కంపెనీలకు కొత్త పాలసీల రూపంలో వచ్చిన ప్రీమియం ఆదాయం (నూతన వ్యాపార ఆదాయం) ఏప్రిల్‌లో మంచి వృద్ధిని చూసింది. క్రితం ఏడాది ఇదే నెలతో పోలిస్తే 84 శాతం పెరిగి రూ.17,940 కోట్లకు చేరింది. 24 జీవిత బీమా కంపెనీలు ఉమ్మడిగా 2021 ఏప్రిల్‌లో వసూలు చేసిన నూతన పాలసీల ప్రీమియం రూ.9,739 కోట్లుగా ఉంది. అతిపెద్ద బీమా సంస్థ ఎల్‌ఐసీకి నూతన పాలసీల రూపంలో ఏప్రిల్‌లో రూ.11,716 కోట్లు ప్రీమియం ఆదాయం కింద వచ్చింది. అంతక్రితం ఏడాది ఇదే నెలలో వచ్చిన రూ.4,857 కోట్లతో పోలిస్తే 141 శాతం వృద్ధి చెందింది. ఈ వివరాలను బీమా రంగ నియంత్రణ సంస్థ (ఐఆర్‌డీఏఐ) విడుదల చేసింది.

జీవిత బీమా మార్కెట్లో 65.31 శాతం వాటా ఎల్‌ఐసీ చేతుల్లోనే ఉంది. మిగిలిన 23 ప్రైవేటు బీమా సంస్థల పరిధిలో ఉన్న వాటా 34.69 శాతంగా ఉంది. ఎల్‌ఐసీ కాకుండా మిగిలిన జీవిత బీమా కంపెనీలకు ఏప్రిల్‌ నెలలో కొత్త పాలసీల జారీ ద్వారా వచ్చిన ప్రీమియం ఆదాయం 27% పెరిగి రూ.6,223 కోట్లుగా నమోదైంది. ఎల్‌ఐసీ తర్వాత ప్రీమియం ఆదాయంలో స్టార్‌ యూనియన్‌ దైచీ లైఫ్‌ 122 శాతం, టాటా ఏఐఏ లైఫ్‌ 107 శాతం వృద్ధి చూపించాయి. ఏప్రిల్‌ చివరికి 24 జీవిత బీమా సంస్థల పరిధిలోని మొత్తం పాలసీల సంఖ్య 13,21,098కు చేరింది. ఇందులో ఎల్‌ఐసీ పాలసీలు 9,13,141గా ఉన్నాయి. 

చదవండి: ఎల్‌ఐసీ ఐపీవో సక్సెస్‌
 

>
మరిన్ని వార్తలు