పొలంలో లంకెబిందెలు దొరికాయని, పక్క జిల్లాలు తిరుగుతూ..

11 May, 2022 10:46 IST|Sakshi

సాక్షి,మదనపల్లె టౌన్‌(అన్నమయ్య) : బంగారమని చెప్పి ప్రజల్ని మోసం చేస్తున్న నిందితులను మంగళవారం మదనపల్లె టూటౌన్‌ పోలీసులు పట్టుకున్నారు. సీఐ మురళీక్రిష్ణ, ఎస్‌ఐ చంద్రమోహన్‌ విలేకరులకు వివరాలు వెల్లడించారు. వాల్మీకిపురం మండలం నకిరి మడుగు పంచాయతీ ముడోరపల్లె షికాపాళెంకు చెందిన బి.గోవిందు కుమారుడు బుక్కియార్‌ గిరి అలియాస్‌ గోవిందబాబు, అలియాస్‌ కోటేశ్వరరావు(23), పుంగనూరు మండలం పాళెంపల్లె శికారుపాళ్యంకు చెందిన షానోజి కుమారుడు ముడియార్‌ ముత్యాలప్ప(31), వైఎస్సార్‌ జిల్లా వీరబల్లి మండలం తాటిమాకులపల్లె షికారిపాళ్యంకు చెందిన విజయ్‌కుమార్‌ కుమారుడు రాణా విజయక్రిష్ణ(25) ఒక బృందంగా ఏర్పడ్డారు.

వారు కొన్నేళ్లుగా వైఎస్సార్, అనంతపురం, చిత్తూరు  జిల్లాలతోపాటు ఇంకా పలు చోట్ల తాము వ్యవసాయం చేస్తుండగా పొలంలో బంగారు పెద్ద ఎత్తున దొరికిందని, లంకబిందెలు ఇంట్లో దాచి ప్రభుత్వానికి తెలియకుండా పన్ను ఎగ్గొట్టి అమ్ముకోవాల్సి వస్తోందని అమాయకులను నమ్మించారు. పూసలను మొదట శాంపుల్‌గా బంగారును ఇచ్చి అడ్వాన్స్‌గా డబ్బులు తీసుకుంటారు. మొదటగా కొద్దిపాటి బంగారాన్ని చూపి తరువాత వారికే నకిలీ బంగారాన్ని అప్పచెప్పి వారి వద్ద నుంచి నగదును తీసుకుని పరారు అవుతారు. ఈ క్రమంలో వైఎస్సార్‌ జిల్లా బద్వేలుకు చెందిన ఓ వ్యక్తిని మదనపల్లెకి రప్పించి ఇక్కడ అతన్ని మోసగించి రూ.5.70 లక్షలు తీసుకుని  పరారయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలించి పథకం ప్రకారం అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ.5.70 లక్షల నగదు, నకిలీ బంగారం పూసల దండలు స్వాధీనం చేసుకున్నారు. గతంలోనూ వీరి పైన పలు చోట్ల పూసలు చూపి బంగారం అని నమ్మించి మోసాలకు పాల్పడిన కేసులు ఉన్నట్లు సీఐ తెలిపారు.

చదవండి: మాజీ ప్రేయసి ఇంకొకరితో చనువుగా ఉందని..

మరిన్ని వార్తలు