అంతరిక్ష రంగంలోకి సులభతరంగా ఎఫ్‌డీఐలు

23 Sep, 2023 05:09 IST|Sakshi

కేంద్రం కసరత్తు

న్యూఢిల్లీ: అంతరిక్ష రంగంలోకి మరిన్ని విదేశీ పెట్టుబడులు, ప్రైవేట్‌ సంస్థలను ఆకర్షించే దిశగా కేంద్రం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను మరింత సరళతరం చేయడంపై కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి అంతర్‌–మంత్రిత్వ శాఖల స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని ఒక సీనియర్‌ అధికారి తెలిపారు.

అత్యంత వేగంగా ఎదుగుతున్న ఈ రంగంలో విదేశీ సంస్థలు ఇన్వెస్ట్‌ చేసేందుకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఉపగ్రహాల సంబంధ కార్యకలాపాల విభాగంలో 100 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతి ఉన్నప్పటికీ అది ప్రభుత్వ అనుమతికి లోబడి ఉంటోంది. చంద్రయాన్‌–3 ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో జీ–20 కూటమిలోని మూడు దేశాలు .. అంతరిక్ష రంగంలో భారత్‌తో కలిసి పని చేసే అవకాశాలపై ఆసక్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో తాజా అంశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

పరిశోధన అభివృద్ధి కార్యకలాపాల కోసం ఉపయోగించే ఉపకరణాల తయారీ మొదలుకుని స్పేస్‌ హార్డ్‌వేర్, టెక్నాలజీ సేవలు మొదలైన వాటి దాకా అనేక అంశాలు అంతరిక్ష రంగ అవసరాల్లో ఉంటాయి. వివిధ నివేదికల ప్రకారం అంతర్జాతీయంగా అంతరిక్ష రంగం పరిమాణం 546 బిలియన్‌ డాలర్లుగా ఉంది. 2040 నాటికి ఇది 1 లక్షల కోట్ల డాలర్లకు చేరనుంది. సాంకేతిక పురోగతి, వ్యయ నియంత్రణ చర్యలు మొదలైనవి ఇందుకు దోహదపడనున్నాయి.   

మరిన్ని వార్తలు