బుల్‌ రన్‌ అదిరింది, 5 రోజుల్లో రూ.7.5 లక్షల కోట్ల సంపద సృష్టి!

9 Jul, 2022 11:41 IST|Sakshi

ముంబై: బ్యాంకింగ్, మౌలిక, ఎఫ్‌ఎంసీజీ షేర్లు రాణించడంతో స్టాక్‌ మార్కెట్‌ మూడోరోజూ ముందుకే కదిలింది. ప్రపంచ మార్కెట్లోని సానుకూలతలు సెంటిమెంట్‌ను మరింత బలపరిచాయి. ఫలితంగా శుక్రవారం సెన్సెక్స్‌ 303 పాయింట్లు పెరిగి 54,482 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 88 పాయింట్లు బలపడి 16,221 వద్ద నిలిచింది. మెటల్, రియల్టీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. మిడ్‌సెషన్‌ తర్వాత స్వల్పంగా అమ్మకాల ఒత్తిడికి లోనైనప్పటికీ.., చివరి గంట కొనుగోళ్ల అండతో సూచీలు వారాంతాన్ని లాభాల్లోనే ముగించాయి. 

ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 449 పాయింట్ల పెరిగి 54,627 వద్ద, నిఫ్టీ 142 పాయింట్లు బలపడి 16,275 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.109 కోట్ల షేర్లను అమ్మేయగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.35 కోట్ల షేర్లను కొన్నారు. రూపాయి విలువ శుక్రవారం 13 పైసలు పతనమై 79.26 వద్ద స్థిరపడింది. జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబె హత్యతో ఆసియా మార్కెట్లు మిడ్‌ సెషన్‌లో అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. యూరప్, యూఎస్‌ సూచీలు 1–0.50% లాభపడ్డాయి.

5 రోజుల్లో రూ.7.5 లక్షల కోట్ల సంపద సృష్టి  
క్రూడాయిల్, కమోడిటీ ధరలు దిగిరావడం, విదేశీ ఇన్వెస్టర్లు విక్రయాల ఉధృతి తగ్గుముఖం పట్టడంతో ఈ వారంలో బుల్‌ రన్‌ అదిరింది. సెన్సెక్స్‌ 1,574 పాయింట్లు నిఫ్టీ 469 పాయింట్లు లాభపడ్డాయి. సెన్సెక్స్‌ మూడు శాతం ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.7.5 లక్షల కోట్లు పెరిగింది. జూలై 8న బీఎస్‌ఈ కంపెనీల మొత్తం విలువ రూ.251.59 లక్షల కోట్లుగా నమోదైంది.    

మార్కెట్లో మరిన్ని సంగతులు  
తన అనుబంధ సంస్థ టాటా టెక్నాలజీ పబ్లిక్‌ ఇష్యూ ద్వారా నిధుల సమీకరణకు సిద్ధమైందనే వార్తలతో పాటు మెటల్‌ ధరలు దిగిరావడంతో టాటా మోటార్స్‌ షేరు రెండున్నర శాతం లాభపడి రూ.442 వద్ద స్థిరపడింది.  

విద్యుత్‌ వాహనాల అనుబంధ కంపెనీలో బ్రిటీష్‌ ఇంటర్నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌(బీఐఐ) రూ.1,925 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించడంతో మహీంద్రా అండ్‌ మహీంద్రా కంపెనీ షేరు ఇంట్రాడేలో 5% పెరిగి రూ.1191 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది.  గరిష్ట స్థాయి వద్ద లాభాల స్వీకరణ కారణంగా చివరికి ఫ్లాటుగా రూ.1,133 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు