Heavy Rains: IMD Issues Red Alert In Mumbai, Karnataka As Heavy Rainfall Continues - Sakshi
Sakshi News home page

Heavy Rains Red Alert: కుండపోత వర్షాలు.. ఈ నగరాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ

Published Sat, Jul 9 2022 11:51 AM

Red Alert Issued in Mumbai Karnataka Heavy Rainfall continues Udipu - Sakshi

సాక్షి, బెంగళూరు, ముంబై: నైరుతి రుతుపవనాల ప్రారంభంతో రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ముంబైతో సహా కర్ణాటకలోని కొన్నిజిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. అలాగే తెలంగాణలోనూ శని, ఆది వారాల్లో రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. ఈ వర్షాలు గుజరాత్‌, ఢిల్లీని కూడా తాకనున్నాయని అంచనా వేసింది. మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, కేరళ, మధ్యప్రదేశ్‌లో శనివారం కూడా భారీ వర్షాలు కురవనున్నాయని, అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.

ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

భారీ వర్షాలతో నదులు పోటెత్తుతున్నాయి. జలాశయాలు నిండుకుండల్లా మారాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ముంబైలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. జూలై 11 వరకు రాష్ట్రంలోని కొంకణ్ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ సంస్థ హెచ్చరించింది. ఈ సమయంలో కొంకణ్ ప్రాంతంలోని అన్ని జిల్లాలు కుండపోతగా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
చదవండి: సిటీలో రోజంతా వర్షం.. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదు

రెడ్‌ అలెర్ట్‌
కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ తీరప్రాంతాల్లో కుంభవృష్టి వర్షాలు పడనున్నాయని  భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. కరావళి(కోస్తా), మలెనాడు, దక్షిణ కన్నడ, కొడగు, శివమొగ్గ, ఉత్తర కన్నడ జిల్లాల్లో వరుణుడు ఉగ్రరూపం దాల్చాడు. ఏడు జిల్లాల పరిధిలో పాఠశాలలకు సెలవులు కొనసాగుతున్నాయి. ఉత్తర కన్నడ జిల్లాలో 91 ఇళ్లకు హాని జరిగింది. కుమటా, హొన్నావర తాలూకాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామ పంచాయతీలో నోడల్‌ అధికారిని నియమించి కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్లు ఇన్‌చార్జ్‌ మంత్రి కోటా శ్రీనివాసపూజారి తెలిపారు.  

ఉడుపి జిల్లా వ్యాప్తంగా వానలు ఎడతెరిపిలేకుండా  కురుస్తున్నాయి. సౌపర్ణిక నది నిండుగా పారుతోంది. బైందూరు తాలూకాలో అధికంగా ఇళ్లు దెబ్బతిన్నాయి. మరవంతె తీర ప్రాంతంలో సముద్రం కోసుకుపోతోంది. పొలాల్లో ఉన్న టెంకాయ చెట్లు సముద్రంలోకి కొట్టుకుపోయాయి. బ్రహ్మావర తాలూకా మడిసాలు హొళె నది ఉగ్రరూపం దాల్చింది. ఉప్పూరు, బెళ్మారులోకి నీరు చేరింది. నీలావర, బావలికుద్రు, కోరాడి, చాక్రోరు ప్రాంతాలలో సీతానది పొంగి ప్రవహిస్తోంది. 

ఉత్తర కర్ణాటక వాసుల్లో భయం
మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో ఉత్తర కర్ణాటక జిల్లావాసుల్లో ఆందోళన నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయం వెంటాడుతోంది. కృష్ణ, భద్రా, కావేరి, నేత్రావతి, తుంగ, వేదగంగ, దూద్‌గంగ, ఘటప్రభ, మలప్రభ నదీతీర ప్రాంతాల ప్రజల్లో వరద భీతి నెలకొంది. ముంపు పొంచి ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.  

200 సెంటీమీటర్ల వర్షం కురిసే అవకాశం 
కార్వార, అంకోలా, హొన్నావర, కుమటా, భట్కళ, శిరసి, సిద్ధాపుర, జోయ్యా తాలూకాల పరిధిలో అంగనవాడీ, పాఠశాల, కాలేజీలకు సెలవు ప్రకటించారు. వచ్చే ఐదు రోజుల్లో 200 సెంటీమీటర్ల వాన కురిసే అవకాశం ఉన్నట్లు కర్ణాటక నైసర్గిక వికోప కేంద్రం విశ్రాంత విశేష డైరెక్టర్‌ వీఎస్‌ ప్రకాశ్‌ తెలిపారు. మలెనాడు భాగంలో 150 సెంటీమీటర్లకు పైగా వానలు పడ్డాయని తెలిపారు. కల్యాణ కర్ణాటక భాగంలో ఐదు రోజుల్లో 40 సెంటీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.  

నీటిలో కొట్టుకుపోయిన కారు 
బెళగావి జిల్లాలో భారీగా పడుతున్న వానలతో అథణి తాలూకా రెడ్డికట్టి గ్రామం వద్ద ప్రవాహిస్తున్న కాలువలో కారు పడింది. కారులోని ఇద్దరు మహదేవ చిగరి (26), సురేశ్‌ బడచ (27) మృతి చెందగా, శ్రీకాంత్‌ అనేవ్యక్తి గాయపడి బయటపడ్డారు.     

అదనంగా రూ.55 కోట్ల విడుదల:మంత్రి అశోక్‌ 
వరదలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రెవెన్యూ మంత్రి, విపత్తు నిర్వహణా ప్రాధికార ఉపాధ్యక్షుడు ఆర్‌.అశోక్‌ తెలిపారు. వర్షాలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో పరిహారం, పునరావాసం తదితర పనులకు అదనంగా  రూ.55 కోట్లు విడుదల చేశామన్నారు. మడికేరి, దక్షిణ కన్నడ జిల్లాల్లో ఆయన పర్యటించి వర్షంతో దెబ్బతిన్న ప్రాంతాలను, భూకంపం జరిగిన ప్రాంతాలను పరిశీలించారు.  

 

సహాయక చర్యలు చేపట్టండి∙: సీఎం బొమ్మై
వర్ష ప్రభావిత ప్రాంతాల్లో తక్షణం సహాయక చర్యలు తీసుకోవాలని సీఎం బొమ్మై అధికారులను ఆదేశించారు. శుక్రవారం ముఖ్యమంత్రి నివాస కార్యాలయం కృష్ణా నుంచి ఆయన కలెక్టర్లు, జెడ్పీ సీఈఓలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రాణహాని జరగకుండా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను రంగంలోకి దింపాలన్నారు. మంత్రులు వారి వారి జిల్లాల్లో మకాం వేసి పరిస్థితిని సమీక్షించాలన్నారు.

Advertisement
Advertisement