ఘోర ప్రమాదాలు, కీలక నిర్ణయం: రైల్వే ప్రయాణికులూ అలర్ట్!

19 Jul, 2023 14:51 IST|Sakshi

ఇటీవల జరిగిన ఘోర రైలు ప్రమాదం తరువాత ఇండియన్ రైల్వేస్ కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఐఆర్‌సీటీసీ ప్రయాణీకులకు బీమా సౌకర్యాన్ని డీఫాల్ట్‌గా అందివ్వనుంది.  తాజా నిర్ణయంతో వెబ్‌సైట్‌/యాప్‌లో టికెట్‌ బుక్‌ చేసుకొనే సమయంలో ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ కోసం బీమా ఆప్షన్‌ పక్కనున్న టిక్‌ బాక్స్‌ను ప్రత్యేకంగా ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉండదు.  ఇక నుంచి ఈ ఆప్షన్‌ను ఐఆర్‌సీటీసీ డిఫాల్ట్‌గా ఇస్తోంది.

అంటే ఐఆర్‌సీటీసీ ద్వారా ట్రైన్ టికెట్ బుక్ చేసుకునే ప్రతి ఒక్కరికీ ఇన్సూరెన్స్ అనేది ఆటోమెటిక్‌గానే వస్తుంది. ఒకవేళ బీమా ప్రయోజనాలను వద్దనుకున్నవారు మాత్రం ఆ టిక్‌ మార్క్‌ను తొలగించుకునే సౌలభ్యం కూడా ఉంది.  కానీ ప్రతి ప్రయాణీకులు దీన్ని వినియోగించుకోవడమే చాలా అవసరం.  ఐఆర్‌సీటీసీ పోర్టల్‌లో తమ రైలు టిక్కెట్‌లను బుక్ చేసుకునే ప్రయాణీకులకు ఇప్పుడు ఆటోమేటిక్‌గా రూ. 10 లక్షల బీమా సౌకర్యం  లభిస్తుందని బీమా పరిశ్రమలోని సీనియర్ అధికారి  పేర్కొన్నారని ఐఏఎన్‌ రిపోర్ట్‌ చేసింది. అయితే దీనిపై ఐఆర్‌సీటీసీ అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు. 
   
ఇందుకోసం భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డిఎఐ)ఐఆర్‌సీటీసీకి మాత్రం వెసులుబాటు ఇచ్చింది.  రైల్వే బీమాను ఎంచుకున్న ప్రయాణికుడికి రూ.10 లక్షల వరకు బీమా సదుపాయం లభిస్తుంది. రైలు ప్రమాదంలో మరణించినా,  లేదా శాశ్వతంగా అంగవైకల్యం ఏర్పడితే బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలు  ఇన్సూరెన్స్‌ను  రైల్వే శాఖ అందిస్తుంది. ఒకవేళ తీవ్రంగా గాయపడి పాక్షిక అంగ వైకల్యం ఏర్పడినప్పుడు రూ.7.5 లక్షల వరకు బీమా  లభిస్తుంది. అలాగే గాయపడిన వైద్యఖర్చుల నిమిత్తం రూ.2 లక్షల వరకు అందిస్తారు. అయితే బీమా పాలసీని ఎంచుకున్న ప్రయాణికులు నామినీ వివరాలను జత చేయాల్సి ఉంటుంది.

కాగా ఇప్పటివరకు రైల్వే టికెట్లు బుక్ చేసుకునే సమయంలో  రైల్వే ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆప్షన్‌  క్లిక్‌ చేసి నపుడు బీమా సౌకర్యం అందించే సౌకర్యం ఉండేది. ఈ  రూ. 10 లక్షల  ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ కోసం ఐఆర్‌సీటీసీ కేవలం 35 పైసలు మాత్రమే చార్జ్‌ చేసేది. ఈ బీమా కింద ప్రయాణికులు తమ రైలు ప్రయాణంలో విలువైన వస్తువులు, లగేజీని పోగొట్టుకుంటే పరిహారం లభించే సౌకర్య అందుబాటులోఉండేదన్న సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు