ఐటీ దిగ్గజాల రిక్రూట్‌మెంట్లు అంతంత మాత్రమే! రానున్న రోజుల్లో..

28 Apr, 2023 07:21 IST|Sakshi

కోవిడ్‌ పూర్వ స్థాయిలో 70 శాతానికి పరిమితంవిశ్లేషకుల అంచనా 

ముంబై: ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) రంగంలో కోవిడ్‌ కాలంలో ఒక్క సారిగా వెల్లువెత్తిన నియామకాలు ఆ తర్వాత నుంచి క్రమంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ అనిశ్చితుల మధ్య కంపెనీలు హైరింగ్‌ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. దీంతో ఈసారి నియామకాల పరిస్థితి కోవిడ్‌ పూర్వ స్థాయిలో (2018 - 19 ఆర్థిక సంవత్సరం) దాదాపు 70 శాతానికి పరిమితం కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఐటీ దిగ్గజాల ఇటీవలి ప్రకటనలు ఈ అభిప్రాయాలకు ఊతమిస్తున్నాయి. వీటి ప్రకారం దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) కోవిడ్‌ పూర్వ స్థాయిలో నియామకాలను చేపట్టనుంది.

సుమారు 40,000 గ్రాడ్యుయేట్లను రిక్రూట్‌ చేసుకోనుంది. అలాగే హెచ్‌సీఎల్‌టెక్‌ ఈసారి దాదాపు 30,000 మందిని తీసుకోనున్నట్లు డిసెంబర్‌లో ప్రకటించినా.. ఇటీవల 2022 - 23 నాలుగో త్రైమాసిక ఫలితాల వెల్లడి సందర్భంగా దాన్ని సగానికి పైగా తగ్గించేసింది. 13,000 - 15,000 మందిని మాత్రమే తీసుకునే యోచనలో ఉన్నట్లు పేర్కొంది. దేశీయంగా రెండో అతి పెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్‌ 2023 - 24కు గాను తమ రిక్రూట్‌మెంట్‌ లక్ష్యాలను ఇంకా వెల్లడించనే లేదు.

2019 ఆర్థిక సంవత్సరంతో తాజా గణాంకాలను పోల్చి చూస్తే.. అప్పట్లో ఇన్ఫోసిస్‌ 20,000 మందిని తీసుకోగా, హెచ్‌సీఎల్‌ టెక్, విప్రో తక్కువ స్థాయిలో క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్లు జరిపాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో రిక్రూట్‌మెంట్‌పరంగా కన్సాలిడేషన్‌ చోటు చేసుకునే అవకాశం ఉందని నియామకాల సేవల సంస్థ హైర్‌ప్రో వర్గాలు వెల్లడించాయి. 2019 - 20ని బేస్‌లైన్‌గా తీసుకుంటే ఆ తర్వాత కొద్ది రోజుల పాటు హైరింగ్‌ జరిగిన తీరు అసాధారణమని, అప్పటితో పోలిస్తే ఇప్పుడు మాత్రం నియామకాలు దాదాపు 70 శాతానికి పరిమితం కావొచ్చని పేర్కొన్నాయి.

కంపెనీలకు సవాళ్లు.. 
దేశీ ఐటీ కంపెనీలు పలు సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే అవసరమైన దానికంటే ఎక్కువగా నియమించుకోవడం, భారీ సంఖ్యలో తీసుకునే క్రమంలో నాణ్యమైన అభ్యర్థులను రిక్రూట్‌ చేసుకోలేకపోవడం వంటివి వీటిలో ఉన్నాయ. కోవిడ్‌ సంవత్సరంలో అట్రిషన్‌ (ఉద్యోగుల వలసలు) పెరిగిపోయింది. దీంతో తగినంత మంది సిబ్బందిని తమ దగ్గర ఉంచుకునేందుకు కంపెనీలన్నీ జోరుగా నియామకాలు జరిపాయి.

విపరీతంగా క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్లు జరిపాయి. ఆఫర్‌ లెటర్లు ఇచ్చినా నికరంగా ఎంత మంది చేరతారనే దానిపై స్పష్టత లేకపోవడంతో హైరింగ్‌ లక్ష్యాలను గణనీయంగా పెంచుకున్నాయి. తర్వాత పరిస్థితులు మారాయి. వివిధ కారణాల వల్ల 2022, 2023 బ్యాచ్‌ గ్రాడ్యుయేట్ల చేరిక ప్రక్రియ ఇంకా అసంపూర్తిగానే ఉంది. కొత్త బ్యాచ్‌లపై ఈ ప్రభావాలు మరింతగా ఉండవచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇక హైరింగ్‌ హడావిడిలో పడి ఐటీ సంస్థలు నాణ్యతను పక్కన పెట్టాయని హెచ్‌ఆర్‌ కంపెనీలు చెబుతున్నాయి. 

మదింపు ప్రక్రియ కఠినతరం..
ఏటా దేశీయంగా 10 - 12 లక్షల మంది ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లు కళాశాలల నుండి బైటికి వస్తుండగా వారిలో కేవలం మూడు నుంచి మూడున్నర లక్షల మంది మాత్రమే ఉద్యోగార్హులుగా ఉంటున్నారని అంచనా. దీంతో ప్రస్తుతం రిక్రూట్‌మెంట్‌ను క్రమబద్ధీకరించుకునే క్రమంలో ఐటీ కంపెనీలు నైపుణ్యాల మదింపు ప్రక్రియను కఠినతరం చేయడం మొదలుపెట్టాయి. తద్వారా అర్హత లేని అభ్యర్ధులను వడగట్టే ప్రయత్నాల్లో ఉన్నాయి.

ఉద్యోగార్థుల అర్హతలను మదింపు చేసేందుకు, శిక్షణనిచ్చేందుకు వెలాసిటీ అనే ప్రోగ్రాంను నిర్వహిస్తున్న విప్రో కొత్తగా దానికి తోడుగా మరో పరీక్ష కూడా క్లియర్‌ చేయాలంటూ గ్రాడ్యుయేట్లకు సూచించింది. అందులో ఉత్తీర్ణులు కాకపోతే తొలగించాల్సి వస్తుందని పేర్కొన్నట్లు సమాచారం. అలాగే మధ్య స్థాయి ఐటీ సర్వీసుల కంపెనీ ఎల్‌టీఐమైండ్‌ట్రీ కూడా ఆన్‌బోర్డింగ్‌కు సిద్ధంగా ఉన్న తాజా గ్రాడ్యుయేట్లు.. కొత్త శిక్షణా ప్రోగ్రామ్‌ను కూడా క్లియర్‌ చేయాలని షరతు విధించింది.

ప్రస్తుతం అంతర్జాతీయంగా స్థూల ఆర్థిక పరిస్థితులు అంత సానుకూలంగా లేనందున ఐటీ కంపెనీలకు వచ్చే ప్రాజెక్టులు, హైరింగ్‌పైనా ప్రభావం పడనుందని హెచ్‌ఆర్‌ సర్వీసుల సంస్థలు తెలిపాయి. ముందుగా 2022 బ్యాక్‌లాగ్‌ల భర్తీని పూర్తి చేయడంపై ఐటీ కంపెనీలు దృష్టి పెట్టొచ్చని పేర్కొన్నాయి. తిరస్కరించేందుకు మరింత బలమైన కారణాలు చూపేందుకు మదింపు ప్రక్రియకు మరిన్ని దశలను జోడించవచ్చని తెలిపాయి.   

మరిన్ని వార్తలు