డిజిటల్‌ కరెన్సీవైపు జపాన్‌ చూపు

28 Nov, 2020 11:03 IST|Sakshi

వచ్చే ఏడాది నుంచి ప్రయోగాత్మకంగా డిజిటల్‌ యెన్‌

తొలి దశలో డిజిటల్‌ కరెన్సీ జారీకి 30 సంస్థల గ్రూప్‌ రెడీ

ఫైనాన్షియల్‌ టెక్నాలజీస్‌లో మార్పులను అందుకునేందుకే

టోక్యో: ప్రపంచ దేశాలలో అత్యధికంగా పేపర్‌ కరెన్సీని ఇష్టపడే జపాన్‌లో డిజిటల్‌ కరెన్సీకి తెర తీయనున్నారు. ప్రభుత్వం ఇందుకు తాజాగా సన్నాహాలు చేస్తోంది. తద్వారా 2021లో ప్రయోగాత్మకంగా డిజిటల్‌ యెన్ జారీకి గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వనుంది. కామన్‌, ప్రయివేట్‌ డిజిటల్‌ కరెన్సీ జారీకి 30కుపైగా సంస్థలు సిద్ధంగా ఉన్నట్లు విదేశీ మీడియా పేర్కొంది. డిజిటల్‌ యెన్ జారీకి ప్రణాళికలు వేస్తున్నట్లు ఇటీవల జపనీస్‌ కేంద్ర బ్యాంకు బ్యాంక్‌ ఆఫ్ జపాన్‌(బీవోజే) ప్రకటించిన నేపథ్యంలో పలు కంపెనీలు ముందుకు వస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఫైనాన్షియల్‌ టెక్నాలజీస్‌లో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఆధునిక మార్పులను అందిపుచ్చుకునే ఆలోచనలో జపనీస్‌ ప్రభుత్వం ఉన్నట్లు ఫారెక్స్‌ విశ్లేషకులు తెలియజేశారు. 

నగదుకే ప్రాధాన్యం
జపాన్‌లో పలు డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌ ఉన్నప్పటికీ నగదు లావాదేవీలకే అధిక ప్రాధాన్యమని బీవోజే ఎగ్జిక్యూటివ్‌ హీరోమీ యమవోకా చెప్పారు. నగదు చెల్లింపులను డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌ అధిగమించలేవని వ్యాఖ్యానించారు. అయితే వివిధ ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా ఒకే తరహా లావాదేవీలకు వీలు కల్పించేందుకు యోచిస్తున్నట్లు తెలియజేశారు. ప్రయోగాత్మక దిశలో డిజిటల్‌ కరెన్సీ జారీకి ప్రయివేట్‌ బ్యాంకులకు అవకాశమున్నదని, ఇందుకు ఇతర సంస్థలకూ అవకాశం కల్పించే వీలున్నదని వివరించారు. ప్రపంచంలోనే అత్యల్పంగా జపాన్‌లో నగదు రహిత చెల్లింపుల వాటా 20 శాతంగా నమోదవుతున్నట్లు ఈ సందర్భంగా విశ్లేషకులు తెలియజేశారు. యూఎస్‌లో ఇవి 45 శాతంకాగా.. చైనాలో మరింత అధికంగా 70 శాతానికి చేరినట్లు వివరించారు. 

కారణాలివీ..
చైనాతో పోలిస్తే జపాన్‌లో విభిన్న డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌ ఒకదానితో మరొకటి పోటీ పడుతుండటంవల్ల నగదురహిత చెల్లింపులు తక్కువగా నమోదవుతున్నట్లు తెలుస్తోంది. జపాన్‌లోని మూడు అతిపెద్ద బ్యాంకులు మిత్సుబిషి, మిజుహో ఫైనాన్షియల్‌, సుమితోమో మిత్సుయి తమ సొంత డిజిటల్‌ పేమెంట్‌ విధానాలను అనుసరిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా.. కామన్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా ఉత్పాదకతను పెంచుకోవాలని చూస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు. ఈ బాటలో జపాన్‌లోని మూడు అతిపెద్ద బ్యాంకులతోపాటు.. టెలికమ్యూనికేషన్‌ కంపెనీలు, యుటిలిటీస్‌, రిటైలర్లతో కూడిన 30 సంస్థలతో గ్రూప్‌ను ఏర్పాటు చేస్తోంది. వెరసి కామన్‌ సెటిల్‌మెంట్‌ ప్లాట్‌ఫామ్‌ను వినియోగించడం డిజిటల్‌ కరెన్సీ జారీకి సన్నాహాలు చేస్తోంది.

మరిన్ని వార్తలు