జాగ్వార్‌‌ తొలి ఎలక్ట్రిక్ కారు విడుదల

23 Mar, 2021 21:37 IST|Sakshi

లగ్జరీ ప్యాసింజర్ వాహనాల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ తన తొలి బ్యాటరీ ఎలక్ట్రిక్ కారు జాగ్వార్ ఐ-పేస్‌ను భారత మార్కెట్ లో రూ.1.6 కోట్లకు విడుదల చేసింది. ఎస్‌యూవీ జాగ్వార్‌ ఐ-పేస్‌ను పూర్తిస్థాయి విద్యుత్తు కారుగా మార్కెట్లోకి తీసుకొచ్చింది. జాగ్వార్ ఐ-పేస్ 90 కిలోవాట్ల బ్యాటరీతో పనిచేస్తుంది. ఇది 294 కిలోవాట్ల శక్తిని, 696 ఎన్ఎమ్ టార్క్‌ను విడుదల చేస్తుంది. ఐ-పేస్ కేవలం 4.8 సెకన్లలో 100 కి.మీ వేగాన్ని అందుకోనున్నట్లు కంపెనీ పేర్కొంది. తమ వినియోగదారులకు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసిన తర్వాత ఛార్జింగ్ విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా ఉండటానికి దేశంలో 19 నగరాల్లో 22 రిటైల్ అవుట్‌లెట్‌లలో 35 ఈవీ ఛార్జర్లను అమర్చినట్లు సంస్థ తెలిపింది.  

ప్రతిచోట 7.4 కేడబ్ల్యూ ఏసీతో పాటు 25 కేడబ్ల్యూ డీసీ ఛార్జర్లను అందుబాటులో ఉంచామని పేర్కొంది. వినియోగదారుల సమస్యలను పరిష్కరించడానికి కంపెనీ రిటైల్ నెట్‌వర్క్ పూర్తిగా సిద్ధంగా ఉందని ఇండియా జాగ్వార్ ల్యాండ్ రోవర్ అధ్యక్షుడు, మేనేజింగ్ డైరెక్టర్ రోహిత్ సూరి తెలిపారు. అలాగే, వినియోగదారులు వాహనంలో అందించిన హోమ్ ఛార్జింగ్ కేబుల్‌ను ఛార్జింగ్ కోసం 7.4 కిలోవాట్ల ఏసీ వాల్ మౌంటెడ్ ఛార్జర్‌ను ఉపయోగించవచ్చు. ఛార్జర్‌ని అమర్చడానికి టాటా పవర్‌ లిమిటెడ్‌ సిబ్బంది సహకరిస్తారని చెప్పింది. ఈ కారు కొనుగోలు చేస్తే ఐదేళ్ల సర్వీస్‌ ప్యాకేజీ, ఐదేళ్ల రోడ్‌సైడ్ అసిస్టెన్స్‌ ప్యాకేజీ, ఎనిమిదేళ్ల లేదా 1.6 లక్షల కి.మీ వరకు బ్యాటరీ గ్యారంటీ వంటి అదనపు ప్రయోజనాలు అందిస్తామని తెలిపింది.

చదవండి:

కోమకి కొత్త ఎలక్ట్రిక్ బైక్ మైలేజ్ ఎంతో తెలుసా?

మరిన్ని వార్తలు