కిమ్‌ స్పీచ్‌తో బిత్తరపోయిన అధికారులు! ఇంతకీ ఏమన్నాడంటే..

11 Oct, 2021 11:02 IST|Sakshi

North Korea Economic Crisis: ఆకలి రోదనలు.. లక్షల్లో సొంత ప్రజల మరణాలు చూసి కిమ్‌ జోంగ్‌ ఉన్‌ గుండె కరిగిందా?. ప్రజలకు ప్రత్యక్ష నరకం చూపించే కర్కోటకుడిగా పేరుబడ్డ నార్త్‌ కొరియా నియంతాధ్యక్షుడు.. ఓ మెట్టు దిగాడా? క్షిపణుల ప్రయోగం, అణ్వాయుధాల తయారీతో దాయాదులపై విరుచుకుపడే కిమ్‌.. ఇప్పుడు స్వరం మార్చాడు. ఇక ప్రజల గురించి ఆలోచించాల్సిన టైం వచ్చిందని ఆయన ఇచ్చిన ప్రసంగం.. అధికారులను సైతం విస్మయానికి గురి చేసింది. 


ఆంక్షలు, వరుస విపత్తులతో ఉత్తర కొరియా పరిస్థితి ఆర్థికంగా ఘోరంగా తయారయ్యింది. ఈ తరుణంలో ఆర్థిక వ్యవస్థ పతనం ఏ స్థాయిలో ఉన్నా సరే.. ప్రజల జీవన ప్రమాణాల్ని మెరుగుపర్చాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉందని అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఆదివారం జరిగిన పార్టీ వార్షిక సమావేశంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. మరోవైపు ఏనాడూ ప్రజా సంక్షేమం గురించి పట్టించుకోని కిమ్‌ నోటి నుంచి ఈ స్టేట్‌మెంట్‌ వచ్చేసరికి.. స్టేజ్‌ మీద ఉన్న అధికారులు ఆశ్చర్యపోయారట. ఈ వ్యాఖ్యల్ని అధికారిక మీడియా హౌజ్‌ Korean Central News Agency ప్రసారం చేసింది. 

ముందు ప్రజలు.. తర్వాతే మనం!

న్యూక్లియర్‌ వెపన్స్‌ తయారీ కారణంగా నార్త్‌ కొరియాపై ఆంక్షలు కొనసాగుతున్నాయి.  అటుపై కరువు,  భారీ వర్షాలు, వరదలు..  కొరియా ఆర్థిక వ్యవస్థను దారుణంగా దిగజార్చాయి. వీటికి కరోనా తోడవ్వడం, చైనా నుంచి పూర్తిగా వర్తకం నిలిచిపోవడంతో పరిస్థితి ఘోరమైన సంక్షోభానికి దారితీసింది. మునుపెన్నడూ లేనివిధంగా ఆహార-మందుల కొరతను ఎదుర్కొంటున్నారు అక్కడి ప్రజలు. ఆకలి చావులు సంభవిస్తుండగా.. ఐరాస మానవ హక్కుల విభాగపు దర్యాప్తు సంస్థ కూడా ఈ విషయాన్ని నిర్ధారించింది. ఈ తరుణంలో ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడం కంటే ముందు ప్రజల జీవన విధానం మెరుపరిచే ప్రయత్నం ముమ్మరం చేశాడు అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌!.  

పార్టీ వార్షికోత్సవ సమావేశంలో మాట్లాడుతూ..  ఇకపై పార్టీ మూకుమ్మడిగా పని చేయాలని పిలుపు ఇచ్చాడు. ‘‘ఈ విపత్కర పరిస్థితుల్లో ఆర్థిక సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కోందాం. కలిసి కట్టుగా ముందుకు వెళ్దాం. ప్రజల సంక్షేమమే మన తొలి ప్రాధాన్యం. మిగతావి తర్వాత. అయితే మీరు చేసే పనులు ప్రజలకు మేలు చేస్తాయా? లేదంటే వాళ్ల హక్కుల్ని కాలరాస్తాయా? అనేది సమీక్షించుకోవాలి. ప్రజాశ్రేయస్సుకు విఘాతం కలిగించే పనులు చేస్తే సహించే ప్రసక్తే లేదు’’ అని అధికారులకు హెచ్చరిక జారీ చేశాడాయన. 

ఆర్భాటాలకు దూరంగా..

వర్కర్స్‌ పార్టీ ఆఫ్‌ కొరియా 76వ వార్షికోత్సవ సమావేశం ఆదివారం రాజధాని ప్యాంగ్‌ యాంగ్‌లో జరిగింది. సమావేశానికి ముందు ఆనవాయితీగా వేడుకలు నిర్వహించాల్సి ఉండగా.. ఈసారి ఆర్భాటానికి దూరంగా వేడుకలు విశేషం. సాధారణంగా ఎలాంటి సందర్భంలోనైనా.. మిలిటరీ పరేడ్‌తో తన దర్పాన్ని ప్రపంచానికి ప్రదర్శించుకుంటాడు కిమ్‌. అలాంటిది సాదాసీదాగా నిర్వహించడం బహుశా ఇదే ప్రప్రథమం. 

అమెరికా తిట్టిన తర్వాత.. 

ఇక ఉత్తర కొరియాలో ఇంత దారుణమైన సంక్షోభానికి కిమ్‌ నియంతృత్వ పాలనే కారణమని అమెరికా తిట్టిపోసింది. ఈ మేరకు గురువారం అమెరికా విదేశాంగ శాఖ..   కిమ్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది.  ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ ప్రజలను అక్కడి(నార్త్‌ కొరియా) ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతోంది. మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోంది. ప్రజల కోసం వెచ్చించాల్సిన నిధుల్ని.. మారణాయుధాల తయారీకి మళ్లిస్తున్నారంటూ వైట్‌హౌజ్‌ ప్రతినిధి నెడ్‌ ప్రైస్‌ ఆరోపించారు. ఒకవేళ అవసరం సాయం కోరితే నార్త్‌ కొరియాను ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు కూడా. ఈ తరుణంలో కిమ్‌ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ సమాజంలోనూ ఆసక్తికర చర్చకు దారి తీశాయి.

చదవండి: కిమ్‌ ఇంట అధికార కుంపటి.. సోదరితో వైరం!

మరిన్ని వార్తలు