మహీంద్రా హాలిడేస్‌ లాభం హైజంప్‌ 

26 Apr, 2023 07:54 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆతిథ్య రంగ దిగ్గజం మహీంద్రా హాలిడేస్‌ అండ్‌ రిసార్ట్స్‌ గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం మూడున్నర రెట్లు జంప్‌చేసి రూ. 56 కోట్లను అధిగమించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో దాదాపు రూ. 16 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 543 కోట్ల నుంచి రూ. 712 కోట్లకు ఎగసింది.

మొత్తం వ్యయాలు రూ. 551 కోట్ల నుంచి రూ. 658 కోట్లకు పెరిగాయి. ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం 67 శాతం దూసుకెళ్లి రూ. 114 కోట్లకు చేరింది. 2021–22లో రూ. 68 కోట్ల నికర లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్‌ ఫలితాలివి. మొత్తం ఆదాయం రూ. 2,013 కోట్ల నుంచి రూ. 2,517 కోట్లకు ఎగసింది. మొత్తం ఆదాయం, నిర్వహణ లాభం తదితరాలలో కంపెనీ అత్యుత్తమ పనితీరు చూపినట్లు ఎండీ, సీఈవో కవీందర్‌ సింగ్‌ పేర్కొన్నారు. భౌగోళిక, రాజకీయ వివాదాల కారణంగా తలెత్తిన స్థూలఆర్థిక సవాళ్లలోనూ యూరోపియన్‌ కార్యకలాపాలలో టర్న్‌అరౌండ్‌ను సాధించినట్లు వెల్లడించారు. ఫలితాల నేపథ్యంలో మహీంద్రా హాలిడేస్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో దాదాపు 4 శాతం జంప్‌చేసి రూ. 311 వద్ద ముగిసింది. 

చైర్మన్‌ పదవీ విరమణ 
మహీంద్రా గ్రూప్‌ నాయకత్వ శ్రేణిలో కీలక సభ్యుడు మహీంద్రా హాలిడేస్‌ అండ్‌ రిసార్ట్స్‌ చైర్మన్‌ అరుణ్‌ నందా పదవీ విరమణ చేయనున్నారు. 50 ఏళ్ల సర్వీసు పూర్తిచేసుకుంటున్న నందా 2023 జులై 25న నిర్వహించనున్న వాటాదారుల సాధారణ వార్షిక సమావేశంలో బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. నాన్‌ఎగ్జిక్యూటివ్‌ పదవుల విషయంలో వయసును పరిగణించి తిరిగి ఎంపిక చేయవద్దంటూ బోర్డుకు సూచించినట్లు నందా తెలియజేశారు. మహీంద్రా గ్రూప్‌లో నందా 1973లో అకౌంటెంట్‌గా కోల్‌కతాలో చేరారు. 1976లో సీఎఫ్‌వో, కంపెనీ సెక్రటరీ(మహీంద్రా సింటర్డ్‌ ప్రొడక్ట్స్‌గా పుణేలో బాధ్యతలు స్వీకరించారు. 

మరిన్ని వార్తలు