బాడీ బిల్డర్‌.. అయ్యాడు చైన్‌స్నాచర్‌

26 Apr, 2023 07:50 IST|Sakshi

కర్ణాటక: మిస్టర్‌ ఆంధ్రాగా పేరు గడించిన కడప రవీంద్రనగర నివాసి సయ్యద్‌ బాషా (34), అతని అనుచరుడు షేక్‌ అయూబ్‌ను మంగళవారం బెంగళూరు దక్షిణ విభాగం గిరినగర పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇతడి వద్ద నుంచి రూ.6 లక్షల విలువచేసే బంగారుచైన్లు, రెండు బైకులను స్వా«దీనం చేసుకున్నారు. డీసీపీ కృష్ణకాంత్‌ వివరాలను వెల్లడించారు. సయ్యద్‌ పాషా 2005 నుంచి 2015 వరకు కువైట్‌లో కారుడ్రైవరుగా పనిచేశాడు. అక్కడ ఉండగానే బంగారం స్మగ్లింగ్‌లో పాల్గొన్నాడు. కరోనా సమయంలో సొంతూరికి చేరుకుని బాడీ బిల్డర్‌గా రాణించి పోటీల్లో పాల్గొని మిస్టర్‌ ఆంధ్రగా గుర్తింపు పొందాడు. సులభంగా డబ్బు సంపాదించాలని అడ్డదారులు తొక్కడం మొదలుపెట్టాడు. చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడడంతో స్థానిక పోలీసులు అరెస్ట్‌ చేసి జైలుకు పంపించారు.
  
బెంగళూరులో చోరీలు సులభమని..  
సయ్యద్‌ జైలులో ఉండగా  బెంగళూరులో సులభంగా దొంగతనాలు చేయవచ్చునని తోటి ఖైదీ సలహా ఇచ్చాడు. దీంతో సయ్యద్‌ కొంతకాలం కిందట బెయిల్‌పై విడుదలై కడప నుంచి బెంగళూరు కు చేరుకున్నాడు. బైక్‌లను దొంగిలించి వాటిపై గిరినగర, సుబ్రమణ్యనగర పోలీస్‌స్టేషన్ల పరిధిలో తిరుగుతూ ఒంటరి మహిళలే లక్ష్యంగా చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడ్డాడు. చోరీ తరువాత అదే ప్రాంతంలో మామూలుగానే తిరగేవాడు, దీని వల్ల తనపై ఎవరికీ అనుమానం రాదని భావించేవాడు. అంతేగాక మొబైల్‌ఫోన్‌ను కూడా వాడేవాడు కాదు.  గిరినగరలో నమోదైన చైన్‌స్నాచింగ్‌ కేసుల్లో దర్యాప్తు చేసి సీసీ కెమెరాల చిత్రాల ఆధారంగా బైక్‌ నంబరును గుర్తించారు. మంగళవారం ఇద్దరిని అరెస్ట్‌చేసి విచారణ చేపట్టారు. నగరంలో చైన్‌స్నాచింగ్‌లతో పాటు 32 దొంగతనాలతో సయ్యాద్, అనుచరుని పాత్ర ఉన్నట్లు తెలిసింది.  

ఐపీఎల్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్టు 
బెంగళూరులో ఐపీఎల్‌ బెట్టింగ్‌ దందాకు పాల్పడుతున్న 160 మందితో కూడిన ముఠాను మంగళవారం సీసీబీ పోలీసులు అరెస్ట్‌చేశారు. వీరి వద్ద నుంచి రూ.65 లక్షల నగదు స్వా«దీనం చేసుకున్నారు. బెంగళూరులో ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు జరుగుతున్న సమయంలో ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌ దందా జోరుగా జరిగింది. ఆన్‌లైన్, యాప్‌ల  ద్వారా జరిపేవారు. 

మరిన్ని వార్తలు