పతనానికి చెక్‌- లాభాలతో షురూ

20 Nov, 2020 09:59 IST|Sakshi

164 పాయింట్లు అప్‌- 43,764కు సెన్సెక్స్‌

50 పాయింట్లు ఎగసి 12,822 వద్ద ట్రేడవుతున్న నిఫ్టీ

ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభాల్లోనే

బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 1 శాతం అప్‌

ముంబై, సాక్షి: ముందురోజు నమోదైన పతనానికి చెక్‌ పెడుతూ దేశీ స్టాక్‌ మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 164 పాయింట్లు పెరిగి 43,764కు చేరింది. నిఫ్టీ 50 పాయింట్లు బలపడి 12,822 వద్ద ట్రేడవుతోంది. సహాయక ప్యాకేజీపై కాంగ్రెస్‌లో తిరిగి చర్చలు ప్రారంభంకానున్న అంచనాలతో గురువారం యూఎస్‌ మార్కెట్లు 0.2-0.8 శాతం మధ్య పుంజుకున్నాయి. అయితే సెకండ్‌వేవ్‌లో భాగంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్న కారణంగా ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. కాగా.. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 43,889 వద్ద గరిష్టాన్ని తాకగా.. 43,649 దిగువన కనిష్టానికి చేరింది. ఇక నిఫ్టీ 12,855- 12,784 పాయింట్ల మధ్య ఊగిసలాడింది.

మెటల్‌ జోరు
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రధానంగా రియల్టీ, మెటల్‌, ఐటీ, బ్యాంకింగ్‌, ఎఫ్‌ఎంసీజీ 1-0.5 శాతం మధ్య వృద్ధి చూపాయి. నిఫ్టీ దిగ్గజాలలో టైటన్‌, బజాజ్‌ ఫిన్‌, హెచ్‌డీఎఫ్‌సీ, టాటా స్టీల్‌, నెస్లే ఇండియా, ఎన్‌టీపీసీ, బ్రిటానియా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, హిందాల్కో 3.6-1.5 శాతం మధ్య ఎగశాయి. అయితే యూపీఎల్‌, ఆర్‌ఐఎల్, ఓఎన్‌జీసీ, ఐటీసీ, కోల్‌ ఇండియా, అదానీ పోర్ట్స్‌, ఎస్‌బీఐ లైఫ్‌, డాక్టర్‌ రెడ్డీస్, సిప్లా, ఎయిర్‌టెల్‌ 1.6-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి.

ఐడియా అప్‌
డెరివేటివ్‌ కౌంటర్లలో ఐడియా, బీఈఎల్‌, ఇన్‌ఫ్రాటెల్‌, బాలకృష్ణ ఇండస్ట్రీస్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌, అపోలో హాస్పిటల్స్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ 5-2.5 శాతం మధ్య జంప్‌ చేశాయి. కాగా.. మరోపక్క బాటా, బయోకాన్‌, టొరంట్‌ ఫార్మా, అశోక్ లేలాండ్‌, ఫెడరల్ బ్యాంక్‌ 2-1 శాతం మధ్య డీలా పడ్డాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 1 శాతం స్థాయిలో ఎగశాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,347 లాభపడగా.. 639 నష్టాలతో కదులుతున్నాయి.

ఎఫ్‌పీఐల ఇన్వెస్ట్‌మెంట్స్
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1,181 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 2,855 కోట్ల అమ్మకాలు చేపట్టాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 3,072 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌ రూ. 2,790 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. 

మరిన్ని వార్తలు