Amazon Layoffs: చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో: అమెజాన్‌ సంచలన నిర్ణయం!

15 Nov, 2022 12:06 IST|Sakshi

సాక్షి, ముంబై: ఈకామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ సంచలన నిర్ణయంవైపుగా కదులుతోంది. జెఫ్ బెజోస్ నేతృత్వంలోని కంపెనీ చరిత్రలోనే కనీవిని ఎరుగని రీతిలో ఏకంగా 10వేల ఉద్యోగాలను తగ్గించాలని యోచిస్తోంది. ఇప్పటికే కాంట్రాక్టర్‌ వర్కర్లను తొలగించినట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. ఈ మేరకు ముగిసిన అసైన్‌మెంట్‌ నోటిఫికేషన్లను ఆయా ఉద్యోగులు అందుకుంటున్నారు. దీంతో ఇ-కామర్స్ దిగ్గజం అతిపెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించడం ఇదే తొలిసారని టెక్‌ వర్గాలు భావిస్తున్నాయి. (ElonMusk: తీవ్ర వాదన, ఊడిపోయిన ఉద్యోగం, అసలేం జరిగిందంటే?)

కంపెనీ వార్షిక ప్రణాళిక ప్రక్రియలో భాగంగా హెడ్‌కౌంట్‌ను ఎక్కడ తగ్గించే క్రమంలో ఆయా టీంలు దీనికి సంబంధించి  నిర్ణయం తీసుకోనున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆర్థికమాంద్యం, పడిపోతున్న ఆదాయాల నేపథ్యంలో అమెజాన్‌ ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఎకో స్మార్ట్ స్పీకర్స్‌, అలెక్సా డిజిటల్ అసిస్టెంట్‌లకు బాధ్యత వహించే టీం, అలాగే అమెజాన్ రిటైల్ విభాగాలు, హెచ్‌ఆర్‌ విభాగంలో ఈ కోతలు ఉండనున్నాయి.  (ఉద్యోగులకు అలర్ట్: ఆ బాటలో ఇన్ఫోసిస్‌, సూపర్‌ ఆఫర్‌ కూడా)

డిసెంబర్ 31, 2021 లెక్కల ప్రకారం అమెజాన్‌లో ఫుల్‌టైమ్, పార్ట్‌టైమ్ మొత్తం దాదాపు 16,08,000 మంది ఉద్యోగులు ఉన్నారు. అక్టోబర్‌లో, హాలిడే సీజన్‌ డిమాండ్‌ కనుగుణంగా రెగ్యులర్ వార్షిక హైరింగ్ స్ప్రీలో భాగంగా దాదాపు లక్షా యాభై వేల మంది ఉద్యోగులను నియమించుకుంటామని కంపెనీ ప్రకటించింది. కానీ ఒక నెలలోనే పరిస్థితి తారుమారైంది. నియామకాలను నిలిపివేసిన కంపెనీ ఇపుడిక ఉద్యోగులను తగ్గించుకుంటోంది.  కుదేలవుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అమెరికా టెక్‌ దిగ్గజాలపై తీవ్ర ప్రభావాన్నిచూపిస్తున్నాని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. ట్విటర్‌, మెటా పెద్ద  ఎత్తున తొలగింపులను ప్రకటించగా, సోషల్‌మీడియా దిగ్గజం మెటా  ఏకంగా  11వేల మందికి ఉద్వాసన పలికింది.

ఇదీ చదవండి: ఎయిరిండియాకు భారీ షాక్‌, 122 మిలియన్‌ డాలర్ల జరిమానా

మరిన్ని వార్తలు