Twitter vs Meta: ట్విటర్‌కి గట్టి పోటీ.. త్వరలో కొత్త యాప్!

20 May, 2023 19:53 IST|Sakshi

ఎలాన్ మస్క్ ట్విటర్‌ సొంతం చేసుకున్నప్పటి నుంచి అనేక మార్పులు సంభవిస్తూనే ఉన్నాయి. ఈ మార్పులకు సాధారణ వినియోగదారులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు సైతం విసుగెత్తిపోయారు. ఈ తరుణం కోసం ఎదురు చూస్తున్న మెటా యాజమాన్యంలోని ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ యాప్‌తో పోటీ పడటానికి సిద్ధంగా ఉన్నాయి.

ట్విటర్‌కు ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూసే వారికి ఇప్పటికే మాస్టోడాన్‌, బ్లూ స్కై వంటివి అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇప్పుడు తాజాగా ఫేస్‌బుక్‌ మాతృ సంస్థ మెటా సైతం ట్విటర్‌కు పోటీగా కొత్త యాప్‌ తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌ బ్రాండ్‌పై కొత్త యాప్‌ తీసుకొచ్చేందుకు మెటా సిద్ధమవుతున్నట్లు సమాచారం.

మెటా సైతం కొత్తగా తీసుకురానున్న ఈ యాప్ పేరు అధికారికంగా ప్రస్తావించనప్పటికీ, కొంత మంది దీనిని పీ92, బార్సిలోనా పేర్లతో పిలుచుకుంటున్నారు. కానీ ఇది ఒక ప్రత్యేకమైన యాప్‌గా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ ఏడాది జూన్ నాటికి భారతదేశంలో అందుబాటులో రానున్నట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. ఈ కొత్త యాప్ దాదాపుగా ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ మాదిరిగా ఉంటుందని, ఇందులో ఫోటోలు, వీడియోలు మాత్రమే కాకుండా ఇతరత్రా టైమ్‌లైన్‌ పోస్టులు పెట్టుకోవచ్చని భావిస్తున్నారు.

మెటా విడుదలచేయనున్న ఈ కొత్త యాప్‌లో సుమారు 500 అక్షరాలతో టెక్స్ట్ రాసుకోవడానికి అవకాశం ఉంటుందని తెలుస్తోంది. అంతే కాకుండా ఇన్‌స్టాలో ఫాలో అవుతున్న వారిని కూడా ఒక్క క్లిక్‌తో ఈ కొత్త యాప్‌లోనూ ఫాలో అయ్యే విధంగా కంపెనీ ఏర్పాటు చేస్తోంది. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా భారీగా యూజర్లను సంపాదించుకున్న మెటా ఇప్పుడు త్వరలో విడుదల చేయనున్న కొత్త యాప్ ద్వారా ఎంత వరకు ఆదరణ పొందుతుంది. ట్విట్టర్ యాప్‌కి ప్రధాన ప్రత్యర్థిగా ఈ యాప్ నిలుస్తుందా.. లేదా? అనే మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి.

మరిన్ని వార్తలు