కొత్త ఫండ్స్‌తో రూ. లక్ష కోట్లు

14 Feb, 2022 07:59 IST|Sakshi

2021లో భారీగా సమీకరించిన మ్యుచువల్‌ ఫండ్స్‌ 

ఈ ఏడాది ఎన్‌ఎఫ్‌వోలు తగ్గే అవకాశం 

మార్కెట్లో ఒడిదుడుకులు కారణం

న్యూఢిల్లీ: మ్యుచువల్‌ ఫండ్‌ సంస్థలు (ఏఎంసీ) గతేడాది 140 పైచిలుకు కొత్త ఫండ్‌ ఆఫరింగ్స్‌ (ఎన్‌ఎఫ్‌వో) ద్వారా సుమారు రూ. లక్ష కోట్లు సమీకరించాయి. మార్కెట్లు భారీగా ర్యాలీ చేయడం, రిటైల్‌ ఇన్వెస్టర్లు ఆసక్తి పెరగడం తదితర అంశాలు కూడా ఇందుకు దోహదపడ్డాయి. మార్నింగ్‌స్టార్‌ ఇండియా సంస్థ నిర్వహించిన ఎన్‌ఎఫ్‌వోల గణాంకాల విశ్లేషణలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం క్లోజ్డ్‌ ఎండ్‌ ఫండ్స్, ఎక్సే్చంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌కి సంబంధించిన ఎన్‌ఎఫ్‌వోల ద్వారా ఫండ్‌ సంస్థలు రూ. 99,704 కోట్లు సమీకరించాయి. 2020లో 81 ఎన్‌ఎఫ్‌వోల ద్వారా వచ్చిన రూ. 53,703 కోట్లతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ కావడం గమనార్హం. అయితే, ప్రస్తుతం స్టాక్‌ మార్కెట్లో ఒడిదుడుకులు నెలకొన్న నేపథ్యంలో ఈ ఏడాది ఎన్‌ఎఫ్‌వోల సంఖ్య పరిమితంగానే ఉండవచ్చని మైవెల్త్‌గ్రోత్‌డాట్‌కామ్‌ సహ వ్యవస్థాపకుడు హర్షద్‌ చేతన్‌వాలా, మార్కెట్‌ మాస్ట్రో డైరెక్టర్‌ అంకిత్‌ యాదవ్‌ తదితర మార్కెట్‌ నిపుణులు అభిప్రాయపడ్డారు.  

2020 నుంచి వెల్లువ.. 
సాధారణగా మార్కెట్లు పెరుగుతున్నప్పుడు ఇన్వెస్టర్ల సెంటిమెంటు చాలా ఆశావహంగా ఉంటుంది. అదే సమయంలో ఎన్‌ఎఫ్‌వోలు కుప్పతెప్పలుగా వస్తుంటాయి. తాజాగా కూడా అదే జరిగింది. 2020 మార్చి తర్వాత నుంచి ఇన్వెస్టర్ల సానుకూల సెంటిమెంట్లతో పాటు స్టాక్‌ మార్కెట్‌ కూడా పెరుగుతూ వచ్చింది. అప్పట్నుంచే ఎన్‌ఎఫ్‌వోలు కూడా వెల్లువెత్తాయని చేతన్‌వాలా తెలిపారు. పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు సానుకూలంగా ఉండటంతో వారి నుంచి ఇన్వెస్ట్‌మెంట్లు ఆకర్షించేందుకు ఏఎంసీలు పెద్ద ఎత్తున ఎన్‌ఎఫ్‌వోలు ప్రవేశపెట్టినట్లు వివరించారు.  

ఎక్కువగా ఇండెక్స్‌ ఫండ్‌లు.. 
గతేడాది అత్యధికంగా ఇండెక్స్‌ ఫండ్‌ విభాగంలో 25 ఎన్‌ఎఫ్‌వోలు వచ్చాయి. ఇవి దాదాపు రూ. 4,082 కోట్లు సమీకరించాయి. 24 ఈటీఎఫ్‌లు రూ. 7,482 కోట్లు, 23 ఫిక్సిడ్‌ టర్మ్‌ ప్లాన్లు రూ. 5,057 కోట్లు దక్కించుకున్నాయి. వీటితో పాటు అంతర్జాతీయ ఫండ్లు, రంగాలవారీ లేదా థీమాటిక్‌ ఫండ్స్‌ వైపు కూడా ఇన్వెస్టర్లు ఆకర్షితులయ్యారు. ఏఎంసీలు ప్రవేశపెట్టిన 12 సెక్టోరల్‌ ఫండ్స్‌ రూ. 13,237 కోట్లు, 12 విదేశీ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌ రూ. 6,351 కోట్లు సమీకరించాయి. గతేడాది ఇండెక్స్‌ ఏకంగా 20 శాతం పైచిలుకు రాబడులు అందిం చడం కూడా సూచీ కేటగిరీలో అధిక ఎన్‌ఎఫ్‌వో లు రావడానికి ఒక కారణమని పరిశ్రమ వర్గా లు తెలిపాయి. ఇన్వెస్టర్లు (రిటైల్, సంపన్న, సంస్థాగత) తమ పోర్ట్‌ఫోలియోల డైవర్సి ఫికేషన్‌ (వివిధ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా రిస్కులు తగ్గించుకోవడం)కి ప్రాధాన్యమిస్తున్నారని, కొత్త ఆర్థిక సధనాల వైపు చూస్తు న్నారని స్మాల్‌కేస్‌ వ్యవస్థాపక సీఈవో వసంత్‌ కామత్‌ తెలిపారు.   

చదవండి: ఇప్పుడు బంగారంలో ఇన్వెస్ట్‌మెంట్‌ సరైనదేనా? 

మరిన్ని వార్తలు