మైండ్‌స్పేస్‌ ఆర్‌ఈఐటీ లిస్టింగ్‌ భేష్‌

7 Aug, 2020 11:46 IST|Sakshi

రూ. 29 లాభంతో రూ. 304 వద్ద లిస్టింగ్‌

జులై 29న ముగిసిన ఐపీవో ధర రూ. 275 

ఇష్యూ ద్వారా రూ. 4500 కోట్ల సమీకరణ

గత నెలాఖరున పబ్లిక్‌ ఇష్యూకి వచ్చిన మైండ్‌స్పేస్‌ బిజినెస్‌ పార్క్స్‌ ఆర్‌ఈఐటీ(రీట్‌) ప్రీమియంతో  లిస్టయ్యింది. ఇష్యూ ధర రూ. 275కాగా.. బీఎస్‌ఈలో రూ. 29 లాభంతో రూ. 304 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభమైంది. తదుపరి రూ. 309 వరకూ ఎగసింది. ఇది 12 శాతం వృద్ధికాగా.. ఒక దశలో రూ. 299 వద్ద కనిష్టాన్ని తాకింది. ప్రస్తుతం 10 శాతం జంప్‌చేసి రూ. 305 వద్ద ట్రేడవుతోంది. జులై 27న ముగిసిన ఇష్యూకి 13 రెట్లు అధికంగా స్పందన లభించిన విషయం విదితమే.

రహేజా గ్రూప్‌ 
కె.రహేజా గ్రూప్‌నకు చెందిన కంపెనీ మైండ్‌స్పేస్‌ బిజినెస్‌ పార్క్స్‌ గత నెలలో చేపట్టిన పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ. 4,500 కోట్లు సమీకరించింది. తద్వారా 2019 మార్చిలో ఎంబసీ ఆఫీస్‌ పార్క్స్‌ తదుపరి వచ్చిన రెండో రీట్‌ ఇష్యూగా నిలిచింది. ఐపీవో నిధులను రుణ చెల్లింపులు, కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనున్నట్లు మైండ్‌స్పేస్‌ సెబీకి దాకలు చేసిన ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. కాగా.. ఐపీవో ద్వారా ఇంతక్రితం ఎంబసీ ఆఫీస్‌ రీట్‌ రూ. 4,750 కోట్లు సమీకరించింది. 

బ్యాక్‌గ్రౌండ్‌
మైండ్‌స్పేస్‌ బిజినెస్‌ పార్క్స్‌ ఏర్పాటులో ప్రమోటర్లు రహేజా గ్రూప్‌తోపాటు పీఈ దిగ్గజం బ్లాక్‌స్టోన్‌ సైతం ఇన్వెస్ట్‌ చేసింది. సెబీ వద్ద రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ సంస్థగా రిజిస్టర్‌ అయిన మైండ్‌స్పేస్‌ బిజినెస్‌ పార్క్స్‌.. మొత్తం 295 లక్షల చదరపు అడుగుల ఆఫీస్‌ ప్రాపర్టీలను కలిగి ఉంది. మరో 28 లక్షల చదరపు అడుగులను అభివృద్ధి చేస్తోంది. ముంబై, పుణే, చెన్నై, హైదరాబాద్‌లలో రియల్టీ ఆస్తులను నిర్వహిస్తోంది. కంపెనీ పోర్ట్‌ఫోలియో, ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌ విభాగాల మార్కెట్‌ విలువను 2020 మార్చికల్లా రూ. 23,675 కోట్లుగా మదింపు చేసినట్లు ప్రాస్పెక్టస్‌లో తెలియజేసింది. కంపెనీ ప్రధానంగా లీజుల(అద్దెలు) రూపంలో ఆదాయాన్ని పొందుతుంటుంది. యూనిట్‌ హొల్డర్లకు డివిడెండ్ల రూపంలో ఆదాయం లభిస్తుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  

మరిన్ని వార్తలు